ఆ‘పాత’మధురం.. అధునాతనం
మారిన జీవనశైలికి అనుగుణంగా సరికొత్త ఇసిరెలు
ప్రతి పనినీ సులువు చేసిన ఆధునిక పరికరాలు
ఆరోగ్యానికి దోహదపడిన నాటి వస్తువులు
కాలక్రమంలో కనుమరుగు.. నేడు ఎన్నో గుర్తులు
కరీంనగర్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాలం మారుతున్నది.. ఆ కాలంతోపాటే మన అలవాట్లు, అవసరాలూ మారుతున్నాయి.. వాటికనుగుణంగా మనం వాడే ఇసిరెలూ మారిపోతున్నాయి.. పాత నుంచి కొత్తగా.. యాంత్రీకరణతో ఆధునికరూపు సంతరించుకున్నది.. రోలు పోయి గ్రైండర్ వచ్చినట్టు.. మన ఇంట్లోని చేదబావి, మట్టి పొయ్యి, ఇసుర్రాయి, ల్యాండ్‌ఫోన్, పోర్టబుల్ టీవీ.. ఇలా ప్రతీది అధునాతనంగా మారి, సౌకర్యాన్ని పెంచాయి. ప్రతి పనినీ సులువు చేశాయి. అయితే. అధునాతన సౌకర్యం పాత కష్టాన్ని మరిపిస్తుండొచ్చు గానీ, ఆ కష్టంతో ముడిపడి ఉన్న వస్తువులు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడ్డాయి. అవి నేడు కనుమరుగై కొత్త రూపం దాల్చినా.. ఇంకా గుర్తుకొస్తూనే ఉన్నాయి. అలనాటి జ్ఞాపకాలను ఆస్వాదిస్తున్నా.. ‘నూతనత్వం’ ఎప్పటిప్పుడు నిత్యనూతనంగా మనల్ని ముందుకు నడిపిస్తూ.. ఎన్నో గుర్తులను మిగులుస్తున్నది. పాత, కొత్తతరం అవసరాల మధ్య చోటు చేసుకున్న పరిణామక్రమాలే ఈ ‘ఐతారం’ ప్రత్యేకం.
మారుతున్న కాలంతోపాటే మన జీవన విధానం మారుతున్నది. ఆ జీవనంలో భాగమైన వస్తు సామగ్రి మారిపోతున్నది. యాంత్రీకరణతో విప్లవాత్మక మార్పు కనిపిస్తున్నది. ఆధునికత పుణ్యమాని ఎన్నో వస్తువులు సరికొత్తగా రూపాంతరం చెందాయి. మరెన్నో వస్తువులు ఆధునికంగా రూపుదిద్దుకుని ప్రతి పనినీ సులువు చేశాయి. ఒక్కప్పుడు వాడిన పిండి కోసం ఇసుర్రాయి పోయి గిర్నీ వచ్చింది. తొక్కులు రుబ్బిన రోలును మిక్సీ, గ్రైండర్.. వేడి నీళ్ల కోసం ఉపయోగించిన బాయిలర్‌ను గీజర్ ఆక్రమించింది. మట్టిపొయ్యి మండక గ్యాస్ స్టౌవ్ వెలిగింది. తట్టుకుర్చీ స్థానంలో ప్లాస్టిక్ ఈజీ చైర్ సుఖాసనమైంది. చేదబావిని బోరుబావి మింగేసింది. నులకమంచాన్ని కాట్ కాటేసింది. ప్రయాణాలకు ఉపయోగపడిన కచ్చురాన్ని వెనక్కి నెట్టేసి కారు దూసుకెళ్లింది. ల్యాండ్‌ఫోన్ మూగబోయి స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని చిన్నది చేసింది. ఓ పాతికేళ్ల క్రితం వరకు మనం వాడిన పాత్రలు, వస్తువులు, పనిముట్లు దాదాపుగా అన్నీ కనుమరుగై, వాటి స్థానాన్ని కొత్తతరం వస్తువులు ఆక్రమించాయి. చివరకు పెంకుటిండ్ల స్థానంలో బంగ్లాలు వెలిశాయి. మన వస్ర్తధారణలోనూ మార్పులు వచ్చాయి. పంచెకట్టును ప్యాంట్, షర్ట్.. గోచి చీరెను గోలుసాడి, గోలుసాడిని షర్ట్సెల్వార్ డామినేట్ చేసింది. కాలక్రమంలో వచ్చిన మార్పులతో ఎన్నో వస్తువులు కనుమరుగైపోగా, కొన్ని వస్తువులు, మరికొన్ని వస్తువుల పేర్లు ఇప్పటి తరాలకు తెలియకుండా పోయాయి. అధునాతన సౌకర్యం పాత కష్టాన్ని మరిపించినా.. కష్టంతో ముడిపడి ఉన్న నాటి వస్తువులు మనకు జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయి.
రోలును రుబ్బేసిన గ్రైండర్ఇసుర్రాయిని మాయం చేసిన పిండిగిర్నీఅగ్గిపుల్లను ఆర్పిన లైటర్కట్టెలపొయ్యిని దూరం చేసిన గ్యాస్ సిలిండర్చెంబు పోయి వాటర్బాటిల్బాయిలర్కు బదులు గీజర్బావిని మింగేసిన బోరు బట్టకుర్చీని ఆక్రమించిన ఆరామ్ చైర్మంచాన్ని ఆక్రమించిన కాట్ల్యాండ్ఫోన్ను గల్లంతు చేసిన సెల్ఫోన్పోర్టబుల్ టీవీలను మరిపించిన ఎల్ఈడీలు సైకిల్‌ను కిల్చేసిన మోటర్బైక్ఎడ్లబండిని దెబ్బకొట్టిన ట్రాక్టర్పంచెకట్టు బదులు ప్యాంట్ షర్ట్లుపెంకుటిల్లు పునాదులపై భవంతులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇసిరెలు కనుమరుగై, ఆధునిక వస్తువులు వాటి స్థానాన్ని భర్తీ చేశాయి.