
నిర్మల్ టౌన్, అక్టోబర్ 18: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అర్టీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం 23 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థికి కలెక్టర్ సన్మానం
పెంబి/నిర్మల్‌టౌన్, అక్టోబర్ 18: పెంబి మండలం తాటిగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి తరుణ్ జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో ఎస్టీ కేటగిరీలో 450వ ర్యాంకు సాధించాడు. గుగ్లావత్ జాలాసింగ్-చంద్రకళ దంపతుల కుమారుడు తరుణ్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి గిరిజన కోటాలో మంచి ర్యాంకు సాధించడంతో జడ్పీటీసీ జనాబాయి ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్‌లో కలెక్టర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఆటో డ్రైవర్ జాలాసింగ్ కుమారుడు తరుణ్ జేఈఈలో ర్యాంకు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.