
కేంద్ర ప్రభుత్వ టీమ్‌కు సహకారమందించాలి..
ఎదులాపురం,అక్టోబర్18: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులు వచ్చారని, వారికి ఆయా శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ లెవల్ మానిటరింగ్ టీమ్ సభ్యులతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపడుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం, దీన్ దయాల్ అంత్యోదయ యోజన , ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన, ప్రధాన మంత్రి పించాయి యోజన, (వాటర్ షెడ్), డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మెడెర్నైజేషన్ ప్రోగ్రాం, పంచాయతీరాజ్, బేసిక్ వెరిఫికేషన్, గ్రామపంచాయతీ, పరిపాలన అంశాలపై ఈ నెల 18 నుంచి 24 వరకు గుర్తించిన గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ టీమ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ముత్తుకుమార్, డాక్టర్ కే దేవన్, సంబంధిత శాఖల అధికారులు ఉంటారని తెలిపారు. ఈ నెల 19న బోథ్ బ్లాక్‌లోని పాట్నాపూర్, ఇచ్చోడ మండలం ముక్రా (కే)లో, 20, 21వ తేదీల్లో గుడిహత్నూర్ బ్లాక్‌లోని మద్చాపూర్, మన్నూర్, సీతగొంది, తోషం 22, 23వ తేదీల్లో ఇంద్రవెల్లి బ్లాక్‌లోని గౌరాపూర్, కేస్లాపూర్, రాంపూర్(బీ), వాల్గొండ హీరాపూర్, 24వ తేదీన అధికారులు గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాలపై వివరంగా టీమ్ సభ్యులకు వివరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీఆర్డీఏ కిషన్, ఏపీడీ రవీందర్ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.