
ముడిసరుకు, రవాణా, మార్కెటింగ్ సౌకర్యాలు పుష్కలం
రాష్ట్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు..
ఫ్యాక్టరీ ప్రారంభమైతే వేలాది కుటుంబాలకు ఉపాధి
కర్మాగారాన్ని తెరిపించడంపై బీజేపీ సర్కారు నిర్లక్ష్యం
రాజకీయ లబ్ధి కోసమే కమలనాథుల నాటకం
ఆదిలాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;వందల ఎకరాల భూమి.. వందల కోట్ల ఆస్తులు.. వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల మిషనరీ.. దశాబ్దాలకు సరిపడా ముడిసరుకు.. పుష్కలంగా నీటి వసతి.. మెరుగైన రవాణా.. అనువైన మార్కెటింగ్ సౌకర్యం.. వేలాది మందికి ఉపాధి కల్పించే సిమెంట్ కార్మాగారంపై బీజేపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని.. రాయితీ లు ఇస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించినా పునఃప్రారంభించడానికి ముందుకు రావడం లేదు. జిల్లా నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఢిల్లీ పెద్దలను కలిసినా కనికరించడం లేదు. తాజాగా ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు కేటీఆర్ కూడా కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు లేఖ రాయడంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
‘ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని పునరుద్ధరించండి. అన్ని రకాల వనరులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకా రాలు అందిస్తాం. బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ కూడా సిద్ధంగా ఉంది. గతంలో కూడా పలుమార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం.’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తాజాగా లేఖ రాశారు.
ఆదిలాబాద్ పట్టణ శివారులో కేంద్ర ప్రభుత్వం రూ.47 కోట్లతో ఆగస్టు 15,1982న సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు అంకురార్పణ చేసింది. 772 ఎకరాల్లో ప్లాంట్, 170 ఎకరాల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయగా.. 1984 మేలో ఉత్పత్తి ప్రారంభమైంది. రోజు 1,200 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కాగా.. 48 మిలియన్ టన్నుల లైమ్‌స్టోన్ డిపాజిట్ల మైనింగ్, 32 కేవీ విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం ఉన్నాయి. కర్మాగారంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల కుటుంబాలు ఉపాధి పొందేవి. ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఉండడంతో 1993 వరకు సంస్థ లాభాలు ఆర్జించింది. అప్పటి పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో కోల్, జిప్సం, సున్నపురాయి వంటి ముడిసరుకులపై రాయితీని ఉపసంహరించుకుంది. లేవీ ప్రకారం.. ఉత్పత్తితో 60 శాతం సిమెంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేవి. లేవీని ఎత్తివేయడంతో కర్మాగారం నష్టాలబాట పట్టింది. 1996లో యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేయగా.. 2008లో ఉద్యోగులు స్వచ్ఛంద విరమణ ప్రకటించడంతో పరిశ్రమను మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
కేంద్ర సర్కారు విముఖత
సిమెంట్ కర్మాగారాన్ని పునరుద్ధరించే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం విముఖత చూపుతున్నది. గతంలో స్థానిక బీజేపీ నేతలు మాజీ కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాంను జిల్లాకు ఆహ్వానించారు. ఆయన కూడా సీసీఐ కర్మాగారాన్ని పరిశీలించి, త్వరలోనే తెరుస్తామని, కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్లారు. అనంతరం ఆ హామీలు నీటిమూటలే అవుతున్నాయి. కార్మికులు, కార్మిక కుటుంబాలు కండ్లు ఖాయలు కాసేలా చూసినా ఫలితం ఉండడం లేదు. వారు రావడం ఎందుకు? పరిశీలించడం ఎందుకు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మాలో ఆశలు రేకేత్తించడం మినహా బీజేపీ నాయకులు చేసిందేమీ లేదని ఆవేదన చెందుతున్నారు. ఇకమీదట తెరిపిస్తేనే రావాలని, లేకపోతే మేమేంటో చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా..
ప్రత్యేక రాష్ట్రం సాకారమైనప్పటి నుంచి ప్రభుత్వం సీసీఐని పునఃప్రారంభించడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. అన్ని విధాలా సహకరిస్తామని, నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాయితీలు కల్పిస్తామని రాష్ట్ర సర్కారు నుంచి ప్రకటించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, మాజీ ఎంపీ నగేశ్, డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అప్పటి కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఆనంత్గీతేను కలిశారు. ఫ్యాక్టరీని ప్రారంభించాలని, కావాల్సిన భూములు, వందేళ్లకు సరిపడా ముడిసరుకు, రవాణా, మార్కెటింగ్ సౌకర్యాలు ఉన్నాయని విన్నవించారు. కర్మాగారం ప్రారంభిస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని, ఆర్థికంగా, పారిశ్రామికంగా లబ్ధి చేకూరుతుందని వివరించారు.
మాకు ఉద్యోగాలు వస్తాయి..
ఆదిలాబాద్‌లోని సిమెంట్ పరిశ్రమను ప్రారంభిస్తే మావంటి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి. పరిశ్రమను ప్రారంభించడానికి భూమితోపాటు సిమెంట్ తయారీకీ అవసరమైన ముడిసరుకు, ఇతర వనరులు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. ఆదిలాబాద్ సీసీఐ కూడా ప్రారంభమైతే లాభాలబాటలో కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పరిశ్రమను ప్రారంభించాలి.
కేటీఆర్ ప్రయత్నం శుభపరిణామం..
ఇటీవలే ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు కేటీఆర్ తెరిపించాలని కేంద్రానికి లేఖ రాయడం శుభపరిణామం. గతంల కూడా సీఎం కేసీఆర్ ఆదిలాబాద్‌ను సందర్శించినపుడు కర్మాగారం పునరుద్ధరణపై తమ ఆరాటాన్ని తెలిపారు. రాష్ర్టానికి ఉన్న శ్రద్ధ కేంద్రానికి లేదు. ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నది. మోదీకి ప్రైవేట్‌పై ఉన్న మోజు, సర్కారు పరిశ్రమలపై, కార్మికులపై కూడా లేదు. నిజానికి కేంద్ర సర్కారు ఒక్క సంతకం చేస్తే సరిపోతుంది.
తెలంగాణ సర్కారు సహకారం ఉంటుంది..
సిమెంట్ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరాం. రాష్ట్ర సర్కా రు తరఫున సహాయ, సహకారాలు పూర్తిస్థాయి లో అందిస్తామని తెలిపాం. కావాల్సిన భూము లు, వందేళ్లకు సరిపడా ముడిసరుకు, రవాణా, మార్కెటింగ్ సౌకర్యాలు బాగున్నాయని వివరిం చాం. స్థానికులకు ఉపాధి లభించడంతోపాటు ఆర్థికంగా, పారిశ్రామికంగా లబ్ధి చేకూరు తుందని వివరించాం. కేంద్ర పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నామమాత్రంగా సమావేశం నిర్వహించి చేతులుదులుపుకున్నారు. తర్వాత సీసీఐ విషయాన్ని పట్టించుకున్న నాథుడు లేడు.
-నగేశ్, మాజీ ఎంపీ, ఆదిలాబాద్
ఎంపీ సోయం బాపురావుకు బాధ్యత లేదు..
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావుకు బాధ్యత లేదు. స్థానికంగా సిమెంట్ కంపెనీ ఉంది, అది మూతబడడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. తెరిపిస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నది లేదు. మొన్నటికీ మొన్న కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చి చేతులు దులుపుకు న్నాడు. మళ్లీ పట్టించుకోవడం లేదు. తెలివిగా కర్మాగారాన్ని నష్టాలబాట పట్టించి బీజేపీ సర్కారు మూసివేయించింది. వేలాది మందిని రోడ్డున పడేసింది. ఇప్పుడు తెలంగాణ సర్కారు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెబుతున్నా తెరిపించడం లేదు.
బీజేపీ పెడచెవిన పెడుతోంది..
సిమెంట్ పరిశ్రమను తెరిపించాలని మంత్రి కేటీఆర్‌తోపాటు నేను,జిల్లా ఎమ్మెల్యేలం అందరం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఢిల్లీకి వెళ్లి అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి ఆనంత్గీతేను కలిశాం. కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తే కలిగే ప్రయోజనాలు వివరించాం. నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాయితీలు కల్పిస్తామని తెలియజేశాం. అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సీసీఐని పునఃప్రారంభిస్తే స్థానికులకు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. నిరుద్యోగం తగ్గుతుంది. కేంద్రం ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.
కేటీఆర్ కార్మికుల మనిషి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని తపన పడుతున్నారు. ఇప్పటికే లక్షలాది మందికి ప్రభుత్వ నౌకర్లు ఇచ్చారు. ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని మూసి ఉన్న పరిశ్రమలను పునఃప్రారంభిస్తే స్థానికులకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. సిమెంట్ కర్మాగారాన్ని తెరిపించడానికి.. ఏ రకమైన సాయం అయినా అందిస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించింది. కానీ.. బీజేపీ పెద్దలకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించడం లేదు. స్థానిక ఎంపీ సోయం బాపురావు చొరవ తీసుకుంటే మంచిగుంటది. లేకుంటే తగినశాస్తి జరుగుతది.