
మద్యం దుకాణాలకు దరఖాస్తులు..
మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 443..
గురువారం పెద్ద మొత్తంలో వస్తాయని అధికారుల అంచనా
రిజర్వ్డ్ దుకాణాలు దక్కించుకునేందుకు పోటీ
మంచిర్యాల అర్బన్, నవంబర్ 17 : 2021-23 సంవత్సరానికి కొత్త మద్యం పాలసీ ప్రకారం టెండర్లు ఈ నెల 9 నుంచి నుంచి ప్రారంభమవగా, గురువారంతో గడువు ముగియనున్నది. కాగా, దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. గతంతో పోల్చితే దుకాణాలు పెరగడమే కాకుండా మద్యం పాలసీ వ్యాపారులకు వరంలా మారింది. దీంతో పోటాపోటీగా టెండర్లు వేస్తున్నారు. మరోవైపు చాలా మంది మంచి రోజు కోసం వేచి చూస్తున్నారు. ఆఖరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో గతేడాది 69 దుకాణాలుండగా, ఈ ఏడాది రిజర్వేషన్లలో భాగంగా అదనంగా మరో నాలుగు దుకాణాలు పెంచడంతో ఔత్సాహికులు పోటీపడుతున్నారు.
టెండర్ దాఖలుకు నేడే ఆఖరు…
మంచిర్యాల జిల్లాలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో ఆచితూచి టెండర్లు దాఖలయ్యాయి. గురువారం గడువు దగ్గర పడుతుండడంతో గడిచిన రెండు రోజుల నుంచి వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. సోమవారం 85, మంగళవారం 57 దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం నాటికి మొత్తంగా 150 దరఖాస్తులు దాఖలయ్యాయి. బుధవారం అత్యధికంగా 293 దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 69 దుకాణాలకు 1190 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది మరో రోజు మిగిలి ఉండగానే 443 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఒక వ్యక్తి ఒక్క దుకాణానికి మాత్రమే టెండరు వేసే అవకాశం ఉండగా, ఈసారి ఎన్ని దుకాణాలకైనా సమర్పించే అవకాశం కల్పించడంతో ఆఖరి రోజైన గురువారం అధిక సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉంది.
రిజర్వ్డ్ దుకాణాలపై వ్యాపారుల కన్ను..
జిల్లాలో 73 మద్యం దుకాణాలకుగాను ఎస్సీలకు పది, ఎస్టీలకు ఆరు, గౌడ కులస్తులకు ఆరు, ఓపెన్‌గా 51 దుకాణాలు కేటాయించారు. కాగా, ఇందులో రిజర్వ్డ్ దుకాణాలపై వ్యాపారులు కన్ను వేశారు. బినామీలతో టెండర్ వేయించి వస్తే గుడ్‌విల్ లేదా ఎంతో కొంత వాటా ఇచ్చి దక్కించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇప్పటికే కొందరు ఆయా రిజర్వ్డ్ కులాల వారితో కలిసి టెండర్లు వేయగా, మరి కొంత మంది ఆఖరి రోజైనా వేసేందుకు ఇప్పటికే డీడీలు తీసి సిద్ధంగా ఉన్నారు.