మేదరుల హస్తకళా అద్భుతం
ప్లాస్టిక్ రాకతో ఉపాధిపై దెబ్బ
కౌటాల, సెప్టెంబర్ 17 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), రెబ్బెన, బెజ్జూర్, వాంకిడి, దహెగాం, పెంచికల్‌పేట, ఆసిఫాబాద్ మండలాల్లో 304 మేదరి కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 283 కుటుంబాలు వెదురు బొంగులతో వస్తువులు తయారు చేస్తూ.. అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. వీరు చాటలు, గంపలు, మొంటెలు, పెద్ద గంపలు, కోళ్ల గూళ్లు, దుర్గామాత(పెద్దదేవర) పూజకు ఉపయోగించే సామగ్రి, తడకలు, గుమ్ములు(వడ్లు, జొన్నలు దాచుకునే వస్తువు), సింగరేణిలో బొగ్గు తోడేందుకు ఉపయోగించే గంపలు, మోటార్ సైకిల్, గుడి ఆకారాలు, పూల బుట్టలు, పూల స్టాండ్లు, ఫొటో ఫ్రేంలు తయారు చేస్తున్నారు. వీటిని పల్లెల్లో తెల్లవారు జామునే వీధివీధి తిరుగుతూ అమ్మి ఉపాధి పొందుతున్నారు. అయితే ప్లాస్టిక్ వస్తువుల రాకతో మేదరులు(మహేందరులు) తయారు చేసిన వస్తువులకు డిమాండ్ తగ్గింది. రోజంతా కష్టపడినా.. కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడంతో మేదరుల బతుకులు ఛిద్రమవుతున్నాయి.
ప్లాస్టిక్‌తో వ్యాధులు
ప్లాస్టిక్‌తో వ్యాధులు వ్యాపించడంతోపాటు పర్యావరణ కాలుష్యం అవుతుం దని నిపుణులు చెబుతున్నారు. రాబోయే తరానికి భారీ ప్రమాదం ముంచుకువచ్చే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయిన ప్పటికీ ప్రస్తుత కాలంలో మనుషులు వాడే ప్రతి వస్తువూ ప్లాస్టిక్ మయం అవుతున్నది. ప్లాస్టిక్ భూమిలో కూడా కరగకుండా కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటుందని, దీనితో భూమి నుంచి కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు వెలువడే ప్రమాదం ఉన్నట్లు కూడా వెల్లడించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినప్పటికీ.. నామమాత్రంగానే ఉంది.
వెదురుతో ఆరోగ్యం
వెదురు ఎలాంటి మందులు లేకుండా పూర్తిగా ప్రకృతి సిద్ధంగా పెరిగే మొక్క. ఇది అడవి, కొండ ప్రాంతాలు, పంట పొలాల గట్ల మీద పెరుగుతుంది. దీని ద్వారా ఆరోగ్యకర ఉపయోగాలు ఉన్నట్లు పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెదురు ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల వ్యాధులు దూరమవుతాయని వైద్య విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెదురు పుల్లను పండ్ల పుల్ల మాదిరిగా వాడితే నోటిలోని దుర్వాసన, పిప్పళ్లు, వ్యాధులు దూరమవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.
మాకు అడవే ఆధారం..
వెదురును నమ్ముకుని జీవిస్తున్న మాకు అడవే అధారం. అడవిలో దొరికే వెదురు బొంగులతో వివిధ రకాల వస్తువులు తయారు చేసి, అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాం. ప్లాస్టిక్ వస్తువుల రాకతో.. వెదురు వస్తువులకు ఆదరణ కరువైంది. రోజుల తరబడి చేసిన వస్తువులకు కూలీ డబ్బులు కూడా రావడం లేదు. ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తే మాలాంటి పేదోళ్లకు ఉపాధి దొరుకుతుంది.