
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి
ఉమ్మడి జిల్లాలో 17. 6లక్షల మంది వ్యాక్సిన్‌కు అర్హులు
అధికారుల సమీక్షలో రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్
పాల్గొన్న కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్, భారతి, రాహుల్ రాజ్
విస్తృత అవగాహన కల్పించండి:వైద్యారోగ్యశాఖ డైరెక్టర్
ఆదిలాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. నాలుగు జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు స్వయంగా సీఎస్ సోమేశ్ కుమార్ రంగంలోకి దిగారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య, మున్సిపల్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 22లోగా టీకా కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో 17.6 లక్షల మంది అర్హులుగా ఉన్నారని, ప్రత్యేక ప్రణాళికతో గడువులోగా అందరికీ వ్యాక్సిన్ వేయాలని సూచించారు.
గడువులోగా అర్హులందరికీ టీకా అందించాలని, ఈ నెల 22వ తేదీ వరకు లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ మోర్తజా రిజ్వి, రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడారు. 22వ తేదీ లోగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందశాతం టీకా పంపిణీ పూర్తిచేయాలని సూచించారు. సబ్‌సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మండల, గ్రామస్థాయిలో నోడల్ అధికారులను నియమించుకొని వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ టీకా ఇప్పించాలన్నారు. పట్టణాల్లో మెప్మా రిసోర్స్ పర్సన్ల సహకారంతో, వైద్యసిబ్బంది అర్హులకు టీకా పంపిణీ చేయాలని సూచించారు. ప్రత్యేకాధికారులు, కలెక్టర్లు గ్రామాల్లో పర్యటించి వ్యాక్సిన్ జరుగుతున్న తీరును పరిశీలించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో 17.6 లక్షల మంది వ్యాక్సిన్‌కు అర్హులుగా ఉన్నారని, అధికారులు నాలుగు జిల్లాల్లో రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకొని వందశాతం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోజుకు 15 వేల మంది, ఆదిలాబాద్ జిల్లాలో 20 వేల మంది టీకా తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
స్థానికుల సహకారంతో టీకా పంపిణీ : ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు
టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ స్థానికుల సహకారంతో వ్యాక్సిన్ పంపిణీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. జిల్లాలో మొదటి డోస్ 95 శాతం, రెండో డోస్ 39 శాతం పూర్తయ్యిందన్నారు. ఇందులో నిర్మల్ జిల్లాలో ఫస్ట్ డోస్ 83 శాతం, సెకండ్ డోస్ 33 శాతం.., ఆదిలాబాద్ జిల్లాలో 79 శాతం ఫస్ట్ డోస్, 23 శాతం సెకండ్ డోస్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి డోస్ 77 శాతం, రెండో డోస్ 16 శాతం వేసినట్లు వెల్లడించారు. అనంతరం నాలుగు జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ.. పింఛన్, నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాలకు వచ్చేవారు వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. మొబైల్ వాహనాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయిస్తామని తెలిపారు. గడువులోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. అంతకుముందు సీఎస్ సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలితారు. ఈ సమావేశంలో వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ గంగాధర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారూఖీ, భారతీ హోళికేరి, రాహుల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.