భక్తిశ్రద్ధలతో శమీ పూజలు
ఆలయాల్లో భక్తుల సందడి
పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు
ఆకట్టుకున్న ‘రామ్‌లీల’లు
పాల్గొన్న మంత్రి అల్లోల, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, అధికారులు
పలుచోట్ల దుర్గామాత నిమజ్జనం
నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. భక్తుల దర్శనాలతో ఆలయాలు సందడిగా మారాయి. రాత్రివేళ నిర్వహించిన రామ్‌లీల కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రావణుడి బొమ్మల దహనంతో వేడుకలు ముగిశాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ కాలనీలో నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి అల్లోల ముఖ్య అతిథిగా పాల్గొని రావణాసుర దిష్టి బొమ్మను దహనం చేయగా, పలుచోట్ల ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఆయా చోట్ల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. మరోవైపు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న దుర్గామాత ప్రతిమలను వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దసరా ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎస్పీ కార్యాలయంలో ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్, భైంసాలో ఏఎస్పీ కిరణ్‌ఖారే, ఖానాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ మైదానంలో ఎమ్మెల్యే జోగు రామన్న, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర, గుడిహత్నూర్‌లోని సాయిబాబా గుడిలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే బాపురావ్, ఉట్నూర్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. ఆయా చోట్ల నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొని, ప్రజలకు దసరా విశిష్టతను వివరించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఊరేగింపుగా వెళ్లి శమీ వృక్షం వద్ద పూజలు చేశారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరంలోని గౌతమేశ్వర ఆలయం వద్ద జమ్మి చెట్టుకు నడిపెల్లి దివాకర్‌రావు పూజలు నిర్వహించారు. మందమర్రిలోని సింగరేణి పాఠశాల మైదానంలో మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. బొగ్గు గనులపై సింగరేణి అధికారులు వాహనాలకు పూజలు చేశారు. బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాణం వేసి, రావణుడి బొమ్మను దహనం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సినీ దర్శకుడు నాగబాల సురేశ్, కాగజ్‌నగర్‌లో కోనేరు కోనప్ప జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌లో ఏఎస్పీ సుదీంధ్ర ఆయుధ, వాహన పూజ చేశారు.