
రూ.50 వేల వరకు తీసుకున్న వారికి రద్దు
రెండో విడుతలో 50,049 మందికి రూ.191.09 కోట్లు మాఫీ
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న సర్కారు
అన్నదాతల్లో ఆనందహేల
ఆదిలాబాద్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రైతన్నలకు రుణబాధ తీరింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు విడుతలవారీగా పంట రుణం మాఫీ చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడుతగా రూ.25 వేలలోపు మాఫీ చేయగా.. తాజాగా రూ.50 వేల వరకు తీసుకున్న రైతుల రుణం రద్దు చేస్తున్నారు. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మొదటి, రెండు విడుతల్లో ఆదిలాబాద్ జిల్లాలో 16,817 మంది రైతులకు రూ.39.15 కోట్లు, మంచిర్యాలలో 22,389 మందికి రూ.60.41 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 34,699 మందికి రూ.63.89 కోట్లు, నిర్మల్ జిల్లాలో 18,604మందికి రూ.58.01 కోట్ల రుణం మాఫీ అయింది. కాగా.. మొదటి, రెండో విడుతల్లో కలిపి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 92509 మంది రైతులకు రూ.221.46 కోట్ల రుణమాఫీ అయింది. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నందునా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతుంది. ఉన్నత చదువులు చదుకు న్న వారు సైతం వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయలో భాగం గా చెరువుల మరమ్మతులు లాంటి పథకాలు వ్యవసాయాన్ని పండుగలా మార్చా యి. రైతులకు పంటల సాగులో అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించింది. రైతుబంధు పథకంలో భాగంగా రెండు సీజన్లకు గానూ ఎకరాకు రూ. 10 వేల పంటపెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ముందుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. రైతుబీమా పథకం ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షలను అందిస్తుంది. వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలను చేపట్టి వారు సమావేశాలు నిర్వహించడానికి అవకాశం కల్పిచంది. వానాకాలం, యాసంగిలో రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలను దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తుంది. కరోనా కష్టకాలంలో సైతం గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి సర్కారు పంటలను సేకరించింది. రైతులకు సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో జిల్లాలో ఏటా పంట సాగు విస్తీర్ణం పెరుగుతుంది.
రూ.221.46 కోట్ల రుణాలు మాఫీ
రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ. ఒక లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం విడతలవారీగా మాఫీ చేస్తున్నది. ఇప్పటికే రూ.25 వేల లోపు క్రాఫ్లోన్స్ను సర్కారు మాఫీ చేయగా, రెండో విడుతలో భాగంగా రూ.50 వేల లోపు పంట రుణాలను రద్దు చేస్తుంది. సర్కారు అందిస్తున్న సాయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రెండు విడుతల్లో కలిపి 92,509 మందికి రూ.221.46కోట్ల బకాయిలను ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో మొదటి, రెండో విడుతలో ఆదిలాబాద్ జిల్లాలో 16,817 మంది రైతులకు రూ.39.15 కోట్లు, మంచిర్యాలలో 22,389 మందికి రూ.60.41కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 34,699 మందికి రూ.63.89 కోట్లు, నిర్మల్ జిల్లాలో 18,604 మందికి రూ. 58.01 కోట్ల రుణం మాఫీ అయింది. రెండోవిడుత డబ్బులు సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పటికే ప్రభు త్వం తమకు అన్ని విధాలుగా సాయం అందిస్తుందని, పంటరుణాలను మాఫీ చేయడం సంతోషంగా ఉందని రైతులు అంటున్నారు.