
29 మందికి ఉపాధి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం, ఆగస్టు16: నిరుద్యోగ యువతకు పరిశ్రమల శాఖ ద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఐదు పరిశ్రమల స్థాపనకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమలు రూ.2.12 కోట్లతో ఏర్పాటు చేయడంతో పాటు 29 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధితశాఖల ద్వారా అనుమతులు వచ్చినట్లు తెలిపారు. పరిశ్రమల స్ధాపనకు ఏడు దరఖాస్తులు రాగా, అన్ని అనుమతులు ఉన్నందున ఐదు పరిశ్రమల ఏర్పాటుకు మంజూరు ఇస్తున్నట్లు , పలు కారణాల వలన రెండు దరఖాస్తులు తిరస్కరించినట్లు వివరించారు. టీ ఫ్రైడ్ పథకం కింద 16 మందికి షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి రూ.41.77 లక్షల ట్రాన్స్పోర్ట్ సర్వీస్‌లకు సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ముగ్గురు, షెడ్యూల్డ్ తెగల వారు 13 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. పావలా వడ్డీ కింద రవాణా సర్వీస్ కోసం షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళకు రూ. 17 వేల సబ్సిడీ మంజూరు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషన్రాజు, ఎల్డీఎం చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఇన్చార్జి సీటీవో కే గోదావరి,సహాయ రవాణా అధికారి డీ శ్రీకాంత్, విద్యుత్ శాఖ ఎడీ డీ. ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలి
ఖాళీ స్థలాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. హరిత హారం, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పా టుకు భూముల గుర్తింపు తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీ ల్దార్లతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, మల్టీలేయర్ పద్ధతిలో మొక్కలు నా టాలన్నారు. మొక్కలకు సంబంధించిన వివరా లను ఈ పంచాయతీలో అప్లోడ్ చేయాలన్నా రు. హోంస్టెడ్ మొక్కలను ఇంటింటికీ పంపిణి చేయాలన్నారు. ప్రతి మండలంలో పదెకరాలకు తక్కువ కాకుండా బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వ, అసైన్డ్ , ఇతర భూములను గుర్తించి వివరాలను అందించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి భూములను సేకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, ఎం డేవిడ్, ఆర్డీవో జాడి రాజేశ్వర్, డీఆర్డీఏ కిషన్,ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.