
ఏజెన్సీ గ్రామాల్లో పీరీల ఊరేగింపు
మొక్కులు తీర్చుకున్న ప్రజలు
నార్నూర్,ఆగస్టు16: ఉమ్మడి మండలంలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పీరీలను వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ వీధుల్లో నృత్యాలు చేశారు. సోమవారం మాన్కాపూర్ గ్రామంలో మహిళలు అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం పీరీలకు నైవేద్యం సమర్పించారు. దశమి వరకు మొహర్రం వేడుకలు కొనసాగుతాయని నిర్వాహకుడు కోట్నాక్ నానాజీ తెలిపారు.
కరంజి(టి)లో మలీదల సమర్పణ
భీంపూర్, ఆగస్టు 16: మొహర్రం పండుగకు ప్రఖ్యాతిగాంచిన కరంజి(టీ)లో సోమవారం పరిసర గ్రామాల భక్తులు మలీదలు సమర్పించారు. ఊదు గంధాలు వేసి పీరీలను కొలిచారు. అంతర్గాం, గోముత్రి, గుబ్‌డి, పిప్పల్‌కోటి, ఇందూర్పల్లిలో వేడుకలు కనువిందు చేశాయి.
కొనసాగుతున్న పీరీల పండుగ
ఉట్నూర్, ఆగస్టు 16: ఉట్నూర్, లక్కారంలో సోమవారం పీరీల పండుగ ఘనంగా జరుపుకొన్నారు. పీరీలు ఇంటింటికీ వెళ్తుండడంతో భక్తులు స్వాగతం పలికి మొక్కులు తీర్చుకున్నారు.
బోథ్‌లో పీరీల సందడి
బోథ్, ఆగస్టు 16: మొహర్రం వేడుకలు సమీపిస్తుండడంతో సవార్ల బంగళాల్లో సోమవారం పీరీలను కూర్చో బెట్టారు. ధన్నూర్ (బీ), కౌఠ (బీ), పొచ్చెర, కన్గుట్ట, కుచ్లాపూర్, సొనాల, మర్లపెల్లి, నాగాపూర్ గ్రామాల్లో పీరీల సందడి ప్రారంభమైంది.