
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు
దస్తురాబాద్, డిసెంబర్15 : వరి ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని రైస్ మిల్లుల యజమానులకు నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాం బాబు సూచించారు. మండల కేంద్రంలోని రైస్ మిల్లును బుధవారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను, బియ్యాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణపై రైస్ మిల్లు యజమాని కట్కం వినయ్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యా ప్తంగా 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉంటే ఇప్పటి వరకు 1.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని పేర్కొన్నారు. 8,617 మంది రైతుల ఖాతాల్లో రూ.82.77 కోట్ల డబ్బులను జమ చేసినట్లు తెలిపారు. సీఎంఆర్ లక్ష్యాన్ని నిర్దేశించిన సమయానికి అందించాలని సూచించారు. వరి ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ఇప్పటి వరకు 65 శాతం ట్యాబ్ ఎంట్రీ అయిందని తెలిపారు. జిల్లాలో 192 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 35 కేంద్రాలను బంద్ చేశామని వెల్లడించారు. రైస్ మిల్లుల్లో, వరి కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలీలు తప్పనిసరిగా రెండు డోసుల టీకాలు వేసుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు. ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలు, సమస్యలను తహసీల్దార్ గజానన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ డీటీ జాదవ్ ప్రకాశ్, డీటీ పద్మావతి, డిప్యూటీ సర్వేయర్ సంధ్యారాణి, వీఆర్వోలు విశ్వనాథ్, శివకృష్ణ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ విజయ్ రాజ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.