
ఉమ్మడి జిల్లాకు సరిపడని పప్పులు, కూరగాయలు
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
జిల్లా మార్కెట్లలో డిమాండ్
ఇక్కడ పండిస్తే అధిక లాభాలు
ఆదిలాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రం వడ్లు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర సర్కారు సూచిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సరిపడా దిగుబడి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి పప్పు దినుసులు, కూరగాయల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ మేరకు ఆయా పంటలు వేసుకోవాలని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వరికంటే ఎక్కువ లాభాలు పొందే వీలుంటుందని ప్రోత్సహిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువగా వరి, పత్తి పంటను సాగు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లాలో పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలను సాగుచేస్తే లాభాలు గడించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రైతులు ఎన్నో ఏళ్లుగా కంది, పెసర, మినుము, శనగ, ఇతర పంటలను పండిస్తున్నారు. కం దిని పత్తి, సోయా పంటలో అంతర పంటగా, వేరుగా పండిస్తారు. పెసర, మినుము పంటలు కూడా వేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానకాలంలో 1.70 లక్షల ఎకరాల్లో కంది వేశారు. 20 వేల ఎకరాల వరకు పెసర, మినుము పంటలు సాగవుతాయి. యాసంగిలో శనగ ఎక్కువ విస్తీర్ణంలో పెసర, మినుము పంటలు తక్కువగా వేస్తారు. ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో శనగ పంట వేస్తారు. కందులు ఎకరానికి 6 క్వింటాళ్లు, పెసర్లు ఎకరానికి 5 నుంచి 6 క్వింటా ళ్లు, శనగలు ఎకరాకు 10 క్వింటాళ్లు, మినుములు 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తాయి. ఈ ఏడాది కందికి మద్దతు ధర క్విం టాలుకు రూ.6300, శనగ క్వింటాలుకు రూ.5230, పెసర్లు క్వింటాలుకు రూ. 7275 ఉండగా, మినుములకు రూ. 6300 ఉంది. రెండు సీజన్లలో పప్పుధాన్యాల పంటలు సాగు చేసిన రైతులకు వరి కంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
కూరగాయలు ఎంతో మేలు
జిల్లాలో కూరగాయల పంటలు సాగుచేసిన రైతులకు పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో టమటాను రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుండగా వంకాయ, ఆకుకూరలను సైతం పండిస్తారు. టమాట కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తీసుకుపోయి విక్రయిస్తారు. జిల్లాలోని వివిధ మార్కెట్లలో కూడా విక్రయిస్తారు. ప్రభుత్వం కూరగాయల పంటల సాగుకు సబ్సిడీలు, యంత్రా లు అందిస్తుండడంతో రైతులు ఈ పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా ప్రజలకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు లభించపోవడంతో వ్యాపారులు ఇతర ప్రాంతాలను నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం టమటా కిలోకు రూ.40, వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, దొండకాయ రూ.60 కిలో చొప్పున అమ్ముతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎప్పుడో కోసిన కూరగాయలను దిగుబడి చేస్తుండడంతో సరైన ఆహారం సైతం లభించడం లేదు. రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరల పండిస్తే వరి కంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశాలున్నాయి.
తొగరి పంటతోనే మేలు..
మా కుటుంబానికి 30 ఎకరాల భూమి ఉన్నది. పత్తిలో అంతర్పంటగా యేటా లాగే ఈసారి కూడా తొగరి ( కంది ) పంట వేసినం. మా ప్రాంతంలో వరి పండించాం. రెం డో పంటగా శనగ, పల్లి వేస్తాం. ఈ యేడు తొగరి పంట మంచిగున్నది. సగం క్వింటాలు ఇంట్లోకి తీసుకొని మిగిలినవి విక్రయిస్తాం. సర్కారు రైతుల మంచి కోసం చేస్తున్న సూచనలు మేము పాటిస్తున్నాం.
రైతులంతా కంది వేశారు..
మా కుటుంబానికి 25 ఎకరాల భూమి ఉన్నది. యేటా మే ము పత్తిలో అంతర్పంటగ తొగరి వేస్తాం. నిరుడు క్విం టాలుకు రూ. 6 వేల దాకా ధర ఉండే ది. ఈ ఏడాది కూడా కందికి మంచి ధర ఉంటుందనే అనుకుంటున్నా. యాసంగిలో కూడా శనగ పండిస్తాం. రైతుబంధు ,ఉచిత విద్యుత్ , కొనుగోళ్లతో అన్నదాతకు అండగా ఉంటున్న సీఎం సార్‌కు కృతజ్ఞతలు.