
నిర్మల్, ఆదిలాబాద్ కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్
నిర్మల్ టౌన్, నవంబర్ 15 : నిర్మల్ జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సోమవారం జిల్లా వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లాలో 40 బృం దాలు పని చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు మొదటి, రెండో డోసు కింద వ్యాక్సినేషన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్న ఆయన.. టీకా వేసుకోలేని వారిని గుర్తించి కచ్చితంగా వేయాలని తెలిపారు. ఇందుకోసం మెప్మా సిబ్బంది, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేసినప్పుడే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి
ఎదులాపురం, నవంబర్ 15 : కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్య, మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ స మావేశ మందిరంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మొదటి డోస్ కూడా తీసుకోని వారికి ఇప్పించాలని, రెండో డోస్ వారికి సమయానికి వేయాలన్నారు. అందుకు ఇంటింటి సర్వే చేయాలని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవ్య, డీఐవో విజయసారథి, మెప్మా డీఎంసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.