
సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలి
నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 14 : జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఠాణాల వారీగా నమోదైన కేసులు, వాటి పురోగతిని, గత నెలలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసుల వివరాలను ఎస్ఐలను అడి గి తెలుసుకున్నారు. ఆయా ఠాణాల్లో పెండింగ్లో ఉన్న కేసులు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను అడిగారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, సరైన సమయంలో సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఇన్చార్జి ఎస్పీ సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. మహిళలపై జరిగే నేరాలపై వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. నమోదైన ప్రతీ కేసులో సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించారు. చోరీల నివారణకు ప్రతీ చోట పెట్రోలింగ్ చేపట్టాలని సూచించారు. నేరాల నియంత్రణ, నేర పరిశోధనకు కీలకంగా మారుతున్న సీసీ కెమరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, డీఎస్పీ జీవన్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్, ప్రవీణ్ కుమార్, వినోద్, చంద్రశేఖర్, రాంనర్సింహా రెడ్డి, అజయ్ బాబు, సీసీఎస్ సీఐలు కుమార స్వామి, ఎంటీవో వినోద్ ఉన్నారు.