
హాజీపూర్, డిసెంబర్ 14 : ఉపాధి హామీ పథకం లో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పేర్కొన్నారు. మండలంలోని గుడిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ వెనుకాల ఈజీఎస్ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న సేద్యపు నీటి కుంటను మంగళవారం పరిశీలించా రు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు వంద రోజుల పని కల్పించాలన్నారు. అందుకుగాను ప్రతిరోజూ కూలీలు ఎక్కువ శాతం హాజరయ్యేలా కూలీల సంఖ్యను పెంచాలని సూచించా రు. మండల అభివృద్ధి అధికారి అబ్దుల్ హై, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, గుడిపేట సర్పంచ్ లగిశెట్టి లక్ష్మీ రాజయ్య, టీఏ వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఎక్కువ మందికి ‘ఉపాధి’ లభించాలి
లక్షెట్టిపేట రూరల్, డిసెంబర్ 14 : ఉపాధి హామీ పనుల ద్వారా ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు. మండలంలోని హన్మంతుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని తలమల అటవీ ప్రాంతంలో చేస్తున్న ఉపాధి హామీ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ప్రతిరోజూ లేబర్ మొబిలేషన్ పెంచి అన్ని గ్రామ పంచాయతీల్లో 50 శాతం మందికి కూలీ కల్పించాలన్నారు. పోస్టల్ ద్వారా కూలీలకు పేమెంట్ సరిగ్గా అందే లా చూడాలని ఎంపీడీవో అజ్మత్ ఆలీ, ఈజీఎస్ ఏపీవోను ఆదేశించారు.
అందరికీ పనులు చూపాలి..
జన్నారం, డిసెంబర్ 14 : ఉపాధి హామీ పనుల్లో ఎక్కువ మంది కూలీలు పనులు చేసేలా చూడాలని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి నిర్వహించిన స మావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది సమన్వయంతో ఉపాధి పనులు చేసేవారిని గుర్తించి అందరికీ పనులు కల్పించడం తో పాటు వారు చేసిన పనులకు ఇవ్వాల్సిన డబ్బులను సకాలంలో అందించాలన్నారు. ఎంపీడీవో అరుణారాణి, ఎంపీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.