
ఆదిలాబాద్ డీఆర్డీవో కిషన్
ఇంద్రవెల్లి, డిసెంబర్14: గ్రామపంచాయతీల పరిధిలో మెగా పార్కులు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ డీఆర్డీవో కిషన్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలో గౌరాపూర్, ముత్నూర్, ధనోరా(బీ)గ్రామపంచాయతీల్లో డీఆర్డీవో కిషన్, అదనపు డీఆర్డీవో రవీందర్ మంగళవారం పర్యటించారు. ఆయా పంచాయతీల్లో బృహత్ పార్కుల ఏర్పాటుకు ఎంపి చేసిన స్థలాలను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. అందులో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో కనీసం ఐదెకరాల స్థలంలో భూమిలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి, అందులో అన్ని రకాల మొక్కలు పెంచాలన్నారు. గతంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లో పెంచుతున్న మొక్కలకు పూర్తి రక్షణ కల్పించాలని సూచించారు. బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. గౌరాపూర్లో గుర్తించిన భూమిలోని బండరాళ్లను తొలగించాలని, భూమిని చదును చేసి బృహత్ పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రకృతి వనాల ఏర్పాటులో నిర్లక్ష్యం తగదని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు కోవ ఫాత్మాబాయి, తుంరం బాగుబాయి, ఏర్మ జాకేశ్వర్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, ఏపీవో సంతోష్ జైస్వాల్, ఈసీ జాదవ్ శ్రీనివాస్, టీఏలు జాదవ్ విఠల్, గణేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు.