
నార్నూర్,డిసెంబర్14 :ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నీటి లభ్యత పెరగడం, రైతులు ఎక్కువగా వరి, పత్తితో పాటు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో కూరగాయలు, ఆకుకూరల సాగుతో లాభాలు ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నార్నూర్ ఏవో గిత్తే రమేశ్ పేర్కొంటున్నారు. విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం, తెగుళ్ల నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు.
విత్తనాల ఎంపిక కీలకం..
సాగుకు, కాలానికి అనువైన రకాలు ఎంచుకోవడం ప్రధానం. ప్రస్తుతం చలితీవ్రత పెరుగుతున్నందున దానిని తట్టుకొనే ప్రత్యేక రకాలు పండించినప్పుడే దిగుబడి వస్తుంది. రాష్ట్రంలో చలికాలంలో పండించేందుకు అనువైన రకాల్లో టమాట, బెండ, క్యాబేజీ, కాలీప్లవర్, క్యారెట్, ఉల్లి, గోరుచిక్కుడు, తోట కూర, పాలకూర, మెంతి, కొత్తిమీర, గోంగూర, బీర, సొరకాయ, కాకరకాయ ఉన్నాయి.
అంతర పంటలతోనూ ఆదాయం..
చలిని తట్టుకునేందుకు నారు పోసి పెట్టే టమాట, మిరప, ఉల్లి వంటి రకాలను షేడ్ నెట్ కిందనే పెంచాలి. తప్పనిసరిగా రసం పురుగుల నివారణకు ఇమిడక్లోరిన్పైడ్తో విత్తన శుద్ధి చేయాలి. దీంతో వైరస్ తెగుళ్ల సమస్యను కూడా అధిగమించవచ్చు. కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి, అరటిలాంటి పండ్ల తోటల్లో మొదటి మూడు, నాలుగేళ్లు అంతర పంటగా బెండ, సోర, బీర, గోరుచిక్కుడు వంటి కూరగాయలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
సంరక్షణ చర్యలు ప్రధానం
నేలలోని తేమను సంరక్షించే చర్యలు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితో పాటు జీవన ఎరువులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల నేలగుల్ల బారి తేమను ఎక్కువ రోజులు పట్టి ఉంచి మొక్కకు అందుబాటులో ఉండేలా చేస్తుంది. నీటి సమస్య ఉన్నా, లేకున్నా డ్రిప్ ద్వారా లేదా తుంపర పద్ధతిలో సాగు చేయడం మేలు. తుంపర పద్ధతిలో పూతదశలో ఎండకాలం ఆరంభమైతే వేడి నుంచి కాపాడుకొని మంచి దిగుబడి సాధించవచ్చు.
తీగజాతి కూరగాయల్లో చలిని తట్టుకోవడానికి 0.5గ్రాముల మాలిక్హైడ్రోజైడ్ 10 లీటర్లకు కలిపి పిచికారీ చేయాలి. గింజ విత్తనం 15 రోజులకు 3గ్రాముల బోరాక్స్ లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే ఆడపూల సంఖ్య పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చు.
ఆకు కూరల పంటల్లో దిగుబడి పెంచడానికి 2శాతం యూరియా, జిబ్బరిలిక్ ఆసిడ్ 50 మిల్లీ గ్రాములు లీటర్నీటికి కలిపి పిచికారీ చేయాలి. యూరియా త్వరగా ఆవిరి కాకుండా మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండేలా తొమ్మిది కిలోల యూరియాకు కిలో వేప పిండి కలిపి వేయాలి. లేదా 25 కిలోల యూరియాకు కిలో వేప నూనె కలిపి పంటలకు వేసుకోవచ్చు.
టమాట, వంకాయ లాంటి పంటల్లో పూత, పిందె రాలకుండా ఉండేందుకు మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ 10 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో వారం వ్యవధిలో రెండు సార్లు కలిపి పిచికారీ చేయాలి.
మిరపలో పూతదశలో ట్రైకాంటినాల్ 20మిల్లీ గ్రాములు లేదా 2.5మిల్లీ లీటర్ల ప్లానోఫిక్స్ 10లీటర్ల నీటిలో కలిపి మూడ్రోజులకోసారి పిచికారీ చేస్తే పిందె నిలిచి కాత వస్తుంది.
ఆరుతడి పంటలతో ఆదాయం
25 ఏళ్లుగా ఆరుతడి పంటలు సాగు చేస్తున్న. మిర్చి, వంకాయ, అలసంద, టమాత సాగు చేస్తున్న. సమయాన్ని బట్టి మంచి ధర లభిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటిస్తున్న. ప్రస్తుతం మిర్చి, అలసంద, టమాట,ఆకు కూరలు సాగు చేస్తున్న.
రాథోడ్ బాబులాల్, రైతు, గంగాపూర్