
గని ప్రమాదం బాధాకరం
విచారణ చేయిస్తున్నాం
ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నాం
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
ఎస్ఆర్పీ 3గని ప్రమాద మృతుల కుటుంబాలకు పరామర్శ
శ్రీరాంపూర్, నవంబర్ 14: ‘అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం.. ప్రభుత్వం, గుర్తింపు కార్మిక సంఘం మీ వెన్నంటి ఉంటుంది’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. ఇటీవల శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 3గని ప్రమాదంలో బేర లచ్చయ్య, ఒంటెల క్రిష్ణారెడ్డి మృతిచెందగా, ఆదివారం కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, మంద మల్లారెడ్డితో కలిసి వారి నివాసాలకు వెళ్లి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడం విచారకరమన్నారు. ప్రమాదంపై విచారణ జరుగుతున్నదని, ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాధిత కుటుంబాలకు సంస్థ పరంగా అన్ని విధాలా నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల మృతికి సంతాపం తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా యాజమాన్యం రక్షణ చర్యలు మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, కేంద్ర ఉపాధ్యక్షుడు నూనె కొంరయ్య, చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, జీఎం ఎం సురేశ్, కౌన్సిలర్ వంగ తిరుపతి, అన్నపూర్ణ, పూదరి కుమార్, ఎస్వోటూ జీఎం కే హరినారాయణగుప్తా, డీవైజీఎం గోవిందరాజు, నాయకలు గోపాల్, మహేందర్‌రెడ్డి, నీలం సదయ్య, మెండ వెంకటి ఉన్నారు.