
సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆసక్తి
రెబ్బెన మండలంలో 179 ఏర్పాటు
పోలీసుల ప్రత్యేక చొరవ
రెబ్బెన, నవంబర్ 14: ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న నేరాలు, ఘోరాలపై మరింత నిఘా పెంచేందుకు పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజీని పదునైన ఆయుధంగా భావిస్తున్నారు. వీటిని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసి పల్లెల్లోనూ నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి జీపీలో సర్పంచ్‌లు, దుకాణాల్లో వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలుండగా.. ఎస్ఐ భవానీసేన్ చొరవతో చాలా జీపీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిల్లోనూ ఏర్పాటు చేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రజాప్రతినిధుల సహకారం..
గ్రామాల్లో ఎస్ఐ భవానీసేన్ ఆధ్వర్యంలో పోలీసులు సర్పంచ్‌లు, నాయకుల సహకారంతో 179 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 124 సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వర్తక, వ్యాపారులు 55 సీసీ కెమెరాలను బిగించుకున్నారు. ఇం దులో గోలేటిలో 32, కిష్టాపూర్‌లో 12, వంకులంలో 10, రెబ్బెనలో 40, తుంగెడలో 12, పులికుంటలో 6, గోలేటి ఎక్స్‌రోడ్‌లో 3, కైర్‌గాంలో 4, ఇందిరానగర్‌లో 4, కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్డులో 4, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాల వద్ద కలిపి 179 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
నేరాల నియంత్రణలో కీలక పాత్ర..
గ్రామాల్లో నేరాలను అరికట్టడం కోసం నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడానికి పోలీస్‌శాఖ శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో తరుచుగా జరిగే గొడవలకు ఎలాంటి సాక్ష్యాలు ఉండక పోవడంతో సరైన న్యాయం చేకూరడం లేదు. ఈ సమస్య సీసీ కెమెరాలతో పరిష్కారం అవుతుంది. ఒక్కసారి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన అంశం తర్వాత ఎలాంటి మార్పునకు అవకాశం ఉండదు. గ్రామాల్లో బైకులు దొంగిలించేవారు, దోపిడీలు చేసే వారు, వాహనాలను ఢీ కొట్టి పారిపోయే వారు వంటివి సీసీ కెమెరాల్లో రికార్డవుతుండడంతో తప్పించుకునేందుకు ఆస్కారం ఉండడం లేదు. ఇటీవల గోలేటి సీహెచ్‌పీ, పులికుంటతో పాటు అంతర్రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలను సీసీ ఫుటేజీ ఆధారంగా సులువుగా తెలుసుకున్నారు. రాత్రివేళల్లో జన సంచారం తక్కువగా ఉండే ప్రదేశాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో మందుబాబులు, రోమియోలకు చెక్ పెడుతున్నారు.
ముందుకొస్తున్న సర్పంచ్‌లు..
చాలా గ్రామాల్లో సీసీ కెమెరా అంటే తెలిసేది కాదు. గ్రామాల్లో ప్రజలు తమ పనులు తాము చేసుకుంటూ బిజీగా ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలను అదుపులో పెట్టడానికి ప్రతి ఒక్క సర్పంచ్ ముందుకొస్తున్నారు. పంచాయతీ నిధుల నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్న పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తున్నది.
ఒక సీసీ టీవీ.. 100మంది పీసీలతో సమానం..
పోలీసు భాషలో చెప్పాలంటే ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా అభివర్ణిస్తుంటారు. ఒక గ్రామంలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే వంద మంది పీసీలు ఆ గ్రామంలో డ్యూటీలో ఉన్నట్లేనని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అందుకే అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలను గుర్తించడం సులువవుతుందని పోలీసులు స్పష్టంచేస్తున్నారు.
179 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం..
మండలంలోని ఇప్పటి వరకు 179 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మొదట్లో చాలా మంది సర్పంచ్‌లు, వ్యాపార సముదాయాల వారు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆసక్తి చూప లేదు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్ర మం ఏర్పాటు చేయడంతో చాలా జీపీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. ఎస్ఐగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత 100 సీసీ కెమెరాలు స్వీయ పర్యవేక్షణలో బిగించాం.