
మంచిర్యాల(నమస్తే తెలంగాణ) /కాసిపేట/దండేపల్లి/పెంబి, జనవరి 14 :మంచిర్యాల జిల్లావ్యాప్తంగా శుక్రవారం చిరు జల్లుల నుంచి భారీ వర్షం కురిసింది. నాలుగు రోజులుగా ముసురు, చలిగాలులు విస్తరించగా, భోగీ పండుగ నాడు ఉదయం నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడింది. సాయంత్రం 4 నుంచి 6 గంటల ప్రాంతంలో జిల్లాకేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు మండలాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాసిపేట మండలంలో శుక్రవారం పది నిమిషాల పాటు వడగండ్ల వాన పడింది. మూడు రోజులుగా మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. వర్షంతో చలి కూడా పెరిగింది. నిర్మ ల్ జిల్లా పెంబి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మే ఘాలు కమ్ముకొని అరగంట పాటు భారీ వర్షం కురిసింది. పెంబిలో గాలివానతో పాటు వడంగండ్లు పడ్డాయి. మండల కేంద్రానికి చెందిన పుండ్ర రవి తన ఎకరంలో వేసిన మక్క పంట పూర్తిగా నెలకొరిగింది. పలు ప్రాంతాలో పత్తి, మక్క, కంది పంటలకు నష్టంవాటిల్లింది.దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మక్కజొన్న, పత్తి పంటలు ధ్వంసమయ్యాయి.