
ఇటీవల పర్యటించిన నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కమిటీ
వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు
త్వరలో రూ. 2 కోట్లు వచ్చే అవకాశం
మరింత అభివృద్ధి చెందనున్న కాలేజీ
ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థుల హర్షం
బెల్లంపల్లి టౌన్, జనవరి 14 : బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ బీ గ్రేడ్ లభించింది. గత నెల 9,10 తేదీల్లో పర్యటించిన నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కమిటీ (న్యాక్) బృందం కళాశాల స్థితిగతులు, విద్యా బోధన, వసతులు, ఆటలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని బీ గ్రేడ్ ఇచ్చింది. త్వరలో రూ. 2 కోట్ల నిధులు వచ్చే అవకాశముండగా, మరింత అభివృద్ధి చెందనున్నది. 33 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కాలేజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగీ కళాశాలలోని ప్రతి విభాగాన్ని న్యాక్ బృందం గతనెల 9,10 తేదీల్లో నిశితంగా పరిశీలించింది. న్యాక్ సభ్యులు డాక్టర్ మురళీధర్ చందేకర్, డాక్టర్ మహమ్మద్ యూసఫ్ పీర్జదా, డాక్టర్ ఎన్.మహదేవ్‌స్వామి విభాగాల బాధ్యులతో ముఖాముఖి మాట్లాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం ఎలా ఉందన్న విషయాలపై ఆరా తీశారు. ఆయా విభాగాల రికార్డులను పరిశీలించారు. విభాగాల వారీగా అధ్యాపకులు విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంటరాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థులతో మాట్లాడారు. విభాగాల వారీగా పనితీరుపై పర్యవేక్షించారు. కళాశాల మైదానం, ప్రహరీ, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడలు తదితర వసతులను పరిశీలించారు.
కళాశాలలో సకల సౌకర్యాలు
కళాశాలలోని ప్రతి విభాగం బాధ్యులు రెండేళ్లు కష్టపడి అభివృద్ధికి కృషి చేశారు. సకల సౌకర్యాలు, వసతులను పరిశీలించిన బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కళాశాలకు న్యాక్ బీ గ్రేడ్ రావడం వెనుక కళాశాలలో ఆయా సబ్జెక్ట్‌ల వారీగా కనబరిచిన పనితీరు ముఖ్య కారణమైంది. కళాశాలలోని భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, కామర్స్, ఆర్ట్స్, భాషా, స్పోర్డ్స్, కల్చరల్ విభాగాల పనితీరు, నిర్వహించిన సదస్సులు, ఇతర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రతి మొక్కకూ జియో ట్యాగ్
పిచ్చి మొక్కలు ఉన్న స్థలాన్ని చదును చేసి విశాలమైన క్రీడామైదానాన్ని ఏర్పాటు చేశారు. వివిధ క్రీడలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. మట్టిలో కలిసేవి, మట్టిలో కలువని వ్యర్థ పదార్థాలను విభజించి ఎరువులు, ఇతర రీైస్లెక్లింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. కళాశాల ఆవరణలో పెంచుతున్న ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేశారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని పొదుపు చేస్తున్నారు. అంతేగాకుండా కంపోస్ట్ ఫిట్ ఏర్పాటు చేశారు. అధునాతన ల్యాబ్‌తో విద్యార్థులకు సాంకేతిక విద్యనందిస్తున్నారు. అన్ని తరగతులకు ప్రొజెక్టర్ సాయంతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. దివ్యాంగ విద్యార్థులు కళాశాలకు రావడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండ్ల తోటను ఏర్పాటు చేసి మొక్కలను విరివిగా పెంచుతున్నారు.
పెరగనున్న వసతులు
కళాశాలకు గుర్తింపు రావడంతో వసతులు మరింత పెరగనున్నాయి. బీ గ్రేడ్‌తో రూ.2కోట్ల నిధులు కళాశాలకు రానున్నాయి. వీటితో వసతిగృహం,స్టేజీ, సైకిల్ స్టాండ్, బైక్,కారు పార్కింగ్,నీటి వసతి, అదనపు తరగతి గదులు, తదితర సౌకర్యాలు కల్పించుకునే అవకాశం ఉంది. న్యాక్ ద్వారా వచ్చే నిధుల ఆధారంగా ఎస్టీమేషన్ వేసి పనులు చేపట్టనున్నారు.
రెండేళ్ల కష్టానికి ఫలితం
అధ్యాపకుల కృషి ఫలితంగానే న్యాక్ బీ గ్రేడ్ వచ్చింది. 2015 నుంచి 2020 వరకు కళాశాలకు సంబంధించిన పాత సమాచారం ఏమి లభించకపోయినా ఎంతో కృషి చేసి ఈ వివరాలను సేకరించాం. రెగ్యులర్ సిబ్బంది అంతంత మాత్రంగానే ఉన్నా కాంట్రాక్ట్ సిబ్బంది సహకారంతో విభాగాల వారీగా ఏడు క్రైటేరియాల సమాచారాన్ని న్యాక్‌కు అందించాం. ఫలితంగా ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది.
-జేవీఆర్.అర్చన,ఐక్యూఏసీ కో ఆర్డినేటర్
తదుపరి లక్ష్యం ఏ గ్రేడ్
కళాశాలకు న్యాక్ బీ గ్రేడ్ రావడం అభినం దనీయం.ఈ గుర్తింపు ద్వారా కళాశాలకు రూసా నిధులు మంజూరు కానున్నాయి. దీని ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. వసతి గృహం నిర్మాణం అయ్యే అవకాశముంది. ఇతర అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్రిన్సిపాల్ నాయకత్వంలో బోధన,బోధనేతర సిబ్బంది అద్భుతంగా పనిచేశారు. మా తదుపరి లక్ష్యం ఏ గ్రేడ్.
-టీ.నవీన్చందర్ రాజు, యూజీసీ కో ఆర్డినేటర్
సమష్టి కృషితోనే సాధ్యం
న్యాక్ బీ గ్రేడ్ వచ్చిన సందర్భంగా మనస్ఫూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నాను.అందరి సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. కళాశాలను కాపాడడంలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయా ల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా విద్యార్థులకు ఉపయోగపడేలా నిర్వహించాలని,ఉత్తమ ఫలితాలు సాధించాలని భావిస్తున్నాను.
-పీ.శ్రీలత, కళాశాల అకాడమిక్ కో ఆర్డినేటర్