
ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లాలో 1520 ఎకరాల్లో సాగు
ఈ యేడాది మరో 75 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు
40 శాతం రాయితీ మరో వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పాం..
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : కేంద్రం వడ్లు కొనబోమని తెగేసి చెప్పడంతో రాష్ట్ర సర్కారు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నది. ఏటా ఒకే రకమైనవి వేసి నష్టపోయేకన్నా.. పండ్ల తోటల పెంపకంపై దృష్టి పెట్టాలని రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ యేడాది మరో 75 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పాం వేయాలని నిర్ణయించి, ఇప్పటికే రైతులకు శిక్షణ ఇచ్చింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే 1520 ఎకరాల్లో మామిడి, ఆపిల్, ఆపిల్‌బేర్, అరటి, దానిమ్మ, పుచ్చ తదితర పంటలు సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటలు వేయడం వల్ల పెట్టుబడి భారం పెరుగుతుండడంతో ప్రభుత్వం ఉద్యాన వన పంటల సాగును ప్రోత్సహిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ పండ్లతోటల సాగును పెంచుతున్నది. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా పండ్లతోటలను పెంచుకునే రైతులకు వాటి సంరక్షణ కోసం 40 శాతం రాయితీని మూడేళ్లపాటు అందించనున్నది. జిల్లాలో గతేడాది 22.65 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేసుకున్న రైతులకు సుమారు రూ. 45 వేలను రాయితీ రూపకంగా అందించింది. వీటితో రైతులు పండ్ల మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ఈ ఏడాది 75 ఎకరాల్లో..
రాష్ట్ర సర్కారు ప్రోత్సాహంతో ఈ ఏడాది జిల్లాలో 75 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. అరటి, మామిడి, బొప్పాయి, జామ, సీతాఫలం సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రూ.5.60 లక్షలను ప్రభుత్వం ఉద్యాన వన శాఖకు కేటాయించింది. రెబ్బెన, సిర్పూర్-టీ, దహెగాం, కెరమెరి, తిర్యాణి మండలాల రైతులు పండ్ల తోటలవైపు ఆసక్తి చూపిస్తుండగా, వారిని ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌పాం..
ఈ ఏడాది జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పాం తోటలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇటీవల వెయ్యి మంది రైతులకు శిక్షణ, క్షేత్ర స్థాయి సందర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకోసం రూ. 10 లక్షలు కేటాయించారు. మరోవైపు జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 47 హెక్టార్లలో బిందుసేద్యం చేసేందుకు 115 మంది రైతులను ఎంపిక చేశారు.