
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఫస్ట్
కొవిడ్ వ్యాక్సినేషన్లో 15 రోజుల్లోనే ఉన్నత స్థాయికి..
నిర్మల్ టౌన్, డిసెంబర్13 : కరోనా కట్టడికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న కొవిడ్ టీకా స్పెషల్ డ్రైవ్ విజయవంతమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారందరికీ తప్పనిసరిగా కొవిడ్ టీకా మొదటి, రెండో డోసులు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీంతో 15 రోజుల్లోనే వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీఎస్ సమీక్షకు ముందు రాష్ట్రంలో నిర్మల్ జిల్లా 27వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది. మంచిర్యాల జిల్లా 12వ స్థానం, ఆదిలాబాద్ 25వ స్థానం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 31వ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ టీకా స్పెషల్ డ్రైవ్‌ను కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆయా పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీకా తీసుకోని వారిని గుర్తించారు. వారికి అక్కడికక్కడే టీకాలు వేసేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ శాతం తక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి వాటిపై దృష్టి సరించారు. మారుమూల గిరిజన తండా ల్లో టీకా తక్కువ నమోదు కావడంతో అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలను వేశారు. ఒక్కో జిల్లాలో 50 బృందాలను ఏర్పాటు చేశారు. పీహెచ్సీ వైద్యులతో పాటు సూపర్వైజర్లు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. ప్రధానంగా షాపింగ్ మాల్స్, బస్టాండ్లు, వ్యాపా ర సముదాయాలు, విద్యా సంస్థలు, దవాఖానలు, సినిమా థియేటర్ల వద్ద ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతో 15 రోజుల్లోనే వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ సక్సెస్ అయింది.
నిర్మల్ జిల్లాలో 536170 మందికి మొద టి దశ టీకా వేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 536635 మందికి వేశారు. వందశాతం మొదటి డోసు పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. రెండో డోసు కింద 3.50లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మంచిర్యాలలో 536109 మందికి వ్యాక్సి న్ ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించగా, 528397 మందికి వేశారు. రెండో డోసు కింద 3లక్షల మందికి టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా లో 548109 లక్ష్యం కాగా.. 500265 మందికి మొదటి డోస్, వేశారు. రెండో డోస్ 2.50 లక్షల మందికి వేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 390194 మంది లక్ష్యం కాగా 315717 మందికి మొదటి డోస్ వేశారు. రెండో డోస్ 2లక్షల మందికి వేశామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమీక్షతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ టీకా స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలను అందించడం, రెండో దశ టీకాలను కూడా వందశాతం పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు.