
బెల్లంపల్లి ఏరియా జీఎం బీ సంజీవరెడ్డి
బీపీఏ ఓసీపీ-2 వద్ద హెల్మెట్ ర్యాలీ
తాండూర్/ రెబ్బెన, డిసెంబర్ 13 : హెల్మెట్ వాడి ప్రాణాలను కాపాడుకుందామని బెల్లంపల్లి జనరల్ మేనేజర్ బీ సంజీవరెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియాలో సోమవారం బీపీఏ ఓసీపీ-2 పరిధిలోని కృషి భవన్, స్టోర్స్, వర్క్‌షాప్, ఏరియా సెక్యూరిటీ సిబ్బందితో ఉమ్మడిగా హెల్మెట్ అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. కార్మికులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. రక్షణ అనేది ఇంటి నుంచే మొదలు కావాలని ఆకాంక్షించారు. కాగా.. ఈ ర్యాలీ కృషి భవన్ నుంచి గోలేటి టౌన్ షిప్ వరకు బీపీఏ ఓసీపీ-2 ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్‌రావు, రక్షణ అధికారి సీహెచ్ కృష్ణారావు సారథ్యంలో నిర్వహించారు. ఏరియా ఇంజినీర్ తిరుమలరావు, డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్, డీజీఎం వర్క్‌షాప్ శివరామిరెడ్డి, బీపీఏ ఓసీపీ రక్షణాధికారి రాజేశ్వర్‌రావు, పిట్ ఇంజినీర్ నరేశ్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వరప్రసాద్, సంక్షేమాధికారి ప్రశాంత్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలి : కొత్తగూడెం జీఎం
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 13 : ద్విచక్ర వాహనాలపై విధులకు హాజరయ్యే ఉద్యోగులందరూ హెల్మెట్ తప్పక ధరించాలని సింగరేణి జీఎం (సెక్యూరిటీ) ఏ కుమార్‌రెడ్డి సూచించారు. హెడ్డాఫీస్ ఎదుట ఎస్ఎస్వో జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో సోమవారం సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా విధులకు వస్తున్న ఉద్యోగులను ఆపి చేతులెత్తి నమస్కరిస్తూ.. హెల్మెట్ ధరించాలని ప్రాధేయపడ్డారు. ఉద్యోగుల ప్రాణాలు వారి కుటుంబానికి, సంస్థకు ఎంతో విలువైనవని అన్నారు. హెల్మెట్ ధరిస్తే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణహాని తీవ్రతను అరికట్టవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరాజం, జమ్మేదార్ భిక్షపతి, సెక్యూరిటీ గార్డులు భాస్కర్‌రెడ్డి, హనుమంత్రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.