
క్యూఆర్కోడ్పై చిత్రీకరించిన షార్ట్ విడుదల
ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర
ఎదులాపురం, డిసెంబర్ 13 : మహిళల రక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఎం రాజేశ్చంద్ర పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో షీటీం బృందం సభ్యులతో సోమవారం సమావేశమయ్యారు. మహిళలు వేధింపులకు గురవుతున్న సమయంలో ఫిర్యాదు చేయడానికి క్యూఆర్ కోడ్ వినియోగంపై మరింత స్పష్టంగా ప్రచారం చేయడానికి చిత్రీకరించిన షార్ట్ఫిలింను జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర విడుదల చేశారు. మహిళలను వేధిస్తున్న సమయంలో క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసిన అనంతరం షీటీం బృందం సభ్యులు పోకిరీలను అరెస్టు చేసే దృశ్యాలను నాటకీయ పరిణామాలతో షార్ట్‌ఫిలిం చిత్రీకరించారు. నెల రోజులుగా అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాస్‌రావు, షీటీం ఇన్చార్జి సునీత ఆధ్వర్యంలో చిత్రబృందం సభ్యులు స్థానిక షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు పీ మహేశ్, కెమెరామెన్, ఎడిటర్ రవితేజ సహకారంతో స్థానిక రైల్వే స్టేషన్లో షార్ట్ఫిలింను చిత్రీకరించారు. షార్ట్‌ఫిలిం చిత్రం పూర్తి అనంతరం జిల్లా ఇన్చార్జి ఎస్పీ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నిర్భయంగా క్యూ ఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసినచో తక్షణమే షీటీం సహాయం అందుతుందన్నారు. మహిళలను వేధింపు సమయంలో ఎవరైనా చూస్తున్న వారు వెంటనే డయల్ 100, షీటీం వాట్సాప్ నంబర్ 8333986926 లేదా క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్ఐ దివ్యభారతి, షీటీం ఇన్చార్జిలు పీ సునీత, ఉజ్వల, కే వాణిశ్రీ, విజయ్ కుమార్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.