
నిర్మాణానికి రూ.4.65 కోట్లు మంజూరు
మెరుగు పడనున్న రవాణా సౌకర్యం
బోథ్, డిసెంబర్ 13: బోథ్-నిర్మల్ నియోజకవర్గాల మధ్య దూరభారాన్ని తగ్గించేందుకు చేపట్టిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. రఘునాథ్‌పూర్ అటవీ ప్రాంతంలో పనులు కొనసాగుతున్నాయి. మరో మూడు, నాలుగు నెలల్లో పనులు పూర్తి కానున్నాయి. అడెల్లి రోడ్డు నిర్మాణానికి నాబార్డు (ఆర్ఐడీఎఫ్-xx) కింద రూ 4.65 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు కోసం వీటిని కేటాయించింది. అటవీ శాఖ అనుమతులు రావడంతో ఎనిమిది నెలల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో పనులు నిలిచిపోగా రెండు నెలల క్రితం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రఘునాథ్‌పూర్ అటవీ ప్రాంతంలో పనులు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా పరిధిలోని నాకాతండా వరకు బీటీ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. రఘునాథ్‌పూర్ నుంచి ఘాట్ ప్రాంతం మీదుగా మరో మూడు కిలోమీటర్లు మాత్రమే రోడ్డు వేయాల్సి ఉంది. అడవిలో బండరాళ్లు ఉండడంతో బ్లాస్టింగ్ చేస్తూ వాటిని పగులగొట్టి ఎక్స్‌కవేటర్‌తో వెడల్పు పనులు చేపడుతున్నారు. మరో మూడు, నాలుగు నెలల్లో రోడ్డు పూర్తి చేసేలా పనులు చేయిస్తున్నారు. అడెల్లి రోడ్డు పూర్తయితే బోథ్‌తో పాటు ఆదిలాబాద్ ప్రాంతంలోని గ్రామాల ప్రజలు పోచమ్మ దేవస్థానానికి వెళ్లడానికి దూరభారం తగ్గుతుంది. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేరుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చుట్టూ తిరిగి పోయే బాధ తప్పుతుంది
మా పల్లెలకు నిర్మల్ ప్రాంతంలోని గ్రామాలతో బంధుత్వం ఎక్కువగా ఉంది. ఏ చిన్న పని ఉన్నా నిర్మల్ నుంచి తిరిగి ఇటు వైపు రావాల్సి వస్తుంది. అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే కాలినడకన కూడా బంధువుల గ్రామాలకు త్వరగా చేరుకోవచ్చు. ఆటోలు, జీపులు నడిస్తే 15 నిమిషాల్లో వెళ్లవచ్చు. తాతల కాలం నుంచి ఈ రోడ్డు అయితది అన్నరు. ఇప్పుడు మాత్రం పనులు చూస్తే సంతోషంగా ఉన్నది.
-ఆడె వాచ్యా, గ్రామస్తుడు, ఖండిపల్లె (కొత్త)
పనులకు పోయి రావచ్చు…
ఈ రోడ్డు పూర్తయితే నిర్మల్ ప్రాంత గ్రామాలకు నిత్యం పనులకు వెళ్లి తిరిగి రావచ్చు. కూరగాయలు పండిస్తే సారంగపూర్, నిర్మల్ మార్కెట్లకు వెళ్లి అమ్మిరావచ్చు. ఈ రోడ్డు పూర్తయితే మా లాంటి పల్లె ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఏదైనా రోగమొస్తే తొందరగా దవాఖానకు తీసుకుపోవడానికి వీలు ఉంటుంది.
-రాథోడ్ ప్రదీప్‌కుమార్, యువకుడు,రఘునాథ్‌పూర్