
కోటపల్లి, డిసెంబర్ 13 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అడవుల్లో పులి కదలికలు మళ్లీ మొదలయ్యాయి. ఇన్నాళ్లూ కే4, ఏ1, జే1, కే6 పులులు సంచరించాయి. పొరుగున ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి తాజాగా మరో పులి కోటపల్లి మండలంలోని అడవుల్లోకి ప్రవేశించింది. మహారాష్ట్ర అడవుల నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లోకి వెళ్లిన పులి సుమారు నెలరోజుల పాటు అక్కడే గడిపింది. జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మహదేవపూర్, కాళేశ్వరం అటవీ ప్రాంతంలో సంచరించిన ఈ ఎస్8 మగ పులి సోమవారం గోదావరి దాటి పారుపల్లి అడవి గుండా రాజారం కొత్తపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. పులి పాదముద్రలు గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. కాగా ఎస్8 పులి కొత్తపల్లి రాజారం అడవుల గుండా లింగన్నపేట, ఎదుల్లబంధం అడవి మీదుగా వెంచపల్లి-సూపాక గ్రామం సమీపంలోని పత్తి చేన్ల వద్ద సోమవారం సాయంత్రం వ్యవసాయ కూలీలకు కనిపించింది. గ్రామాల సమీపంలోని పత్తిచేల వద్ద పులి తిరుగుతుండడంతో వ్యవసాయ కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల సర్పంచ్లు హెచ్చరికలు జారీ చేశారు.