
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
మాజీ త్రివిధ దళాల అధిపతి, అమర జవాన్లకు నివాళి
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 13: భారత సైన్యం పటిష్టతకు మాజీ త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ఎంతో కృషి చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన బిపిన్ రావత్, సైనికులకు పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో నివాళులర్పించారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రావత్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 43ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. 2019లో త్రివిధ దళాల అధిపతిగా బాధ్యతలు చేపట్టి సైనికుల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారతసేనను తీర్చిదిద్దిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, యూనిస్ అక్బానీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అనాథ యువతి వివాహానికి చేయూత
ఎదులాపురం,డిసెంబర్13: పట్టణానికి చెందిన మీనా చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె ఆర్థిక పరిస్థితులతో పాటు నా అనే వాళ్లు లేరనే విషయాన్ని ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ చైర్మన్ ఆదిత్యకు తెలిసింది. ఆమె వివాహానికి చేయూతనందించాడు. తిర్పెల్లిలోని తన కారు షోరూంలో పెళ్లి మండపం ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన సంజుతో మీనాకు వివాహం జరిపించారు. ఆదిత్య సొసైటీ చైర్మన్‌ను ఎమ్మెల్యే జోగు రామన్న అభినందించారు. వధూవరులను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, జడ్పీటీసీ గణేశ్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, కౌన్సిలర్లు ఆశీర్వదించారు.