
నిర్మల్ టౌన్, డిసెంబర్ 13 : ఈ యాసంగిలో వరి వద్దన్న రాష్ట్ర సర్కారు సూచనల మేరకు రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సుమారు మూడు లక్షల ఎకరాల్లో మక్క, శనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలు వేస్తున్నారు. ఇందులో సుమారు లక్షకు పైగా ఎకరాల్లో శనగ వేశారు. వానకాలంలో వరి వేసిన భూముల్లో తేమశాతం అధికంగా ఉండడం ఈ పంటకు కలిసి వస్తున్నది. కేవలం రెండు నీటి తడులతోనే పంట చేతికి రానున్నది. క్వింటాల్‌కు సుమారు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మద్దతు ధర రూ.5,100 ఉండగా.. ఒక్కో రైతుకు అన్ని ఖర్చులుపోనూ ఎకరానికి రూ.15 వేల దాకా ఆదాయం రానున్నది.
యాసంగిలో వరి సాగుపై సందిగ్ధత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నిర్మల్ జిల్లాలో వరి పంటను వదిలి రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి రికార్డుస్థాయిలో వర్షాలు కురవగా.. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావుల కింద పుష్కలమైన నీటి వనరులున్నాయి. దీంతో మొదట వరి సాగు చేద్దామని రైతులు భావించినప్పటికీ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో దాని స్థానంలో ఇతర పంటలు సాగు చేయాలన్న ఆలోచనకు వచ్చారు. మెజార్టీ రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.
రెండు జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా..
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో మూడు లక్షలకు పైగా వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి వరి సాగు మాని ఆరుతడి పంటల్లో మేలైన రకాలుగా గుర్తించే మక్కజొన్న, శనగ, ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. మక్కజొన్నకు నాలుగేండ్లుగా కత్తెర తెగుళ్లు సోకడం, కొనుగోళ్లలో జాప్యం కారణంగా దానిపై నిరాసక్తి చూపుతున్నారు. శనగ పంట సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఈ యాసంగిలో 56 వేల ఎకరాల్లో శనగ పంట సాగు చేయగా.. ఆదిలాబాద్‌లో 45 వేల ఎకరాల్లో వేశారు. అంటే దాదాపు లక్ష ఎకరాలకు పైగా శనగ సాగవుతున్నది. ఈ రెండు జిల్లాల్లో మధ్యస్థ, నల్లరేగడి నేలలుండడం, భూమిలో తేమశాతం అధికంగా ఉండడం, శనగ పంట 90-110 రోజుల్లోపే చేతికి వచ్చే అవకాశం ఉండడంతో రైతులు ఈ పంట వైపే మొగ్గు చూపుతున్నారు.
అనుకూలంగా తేమ ఆధారిత భూములు
ముఖ్యంగా వరి పొలాల్లో తేమశాతం అధికంగా ఉండడం, మడులు కావడంతో ఇతర పంటలతో పోల్చితే శనగ పంటకే తక్కువ ఖర్చు వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఈ పంట సాగు వైపు మళ్లారు. ప్రధానంగా దేశవాళీ రకాల్లో జేజీ 11, జేఐకేఈ 9218, లోకల్ శనగతో పాటు మహారాష్ట్ర శనగలను ఎకరానికి 25 కిలోల చొప్పున విత్తుకుంటున్నారు. మార్కెట్లో 25 కేజీల బ్యాగు ధర రూ.1500 ఉండగా.. ఇది ఎకరానికి సరిపోతుంది. దీనికితోడు ఒక బస్తా ఎరువు, రెండు నీటి తడులతో మాత్రమే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 6-8 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి మడుల్లో వరికొయ్యలను కలియదున్నడంతో సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకుంటున్నారు. మార్కెట్లో మద్దతు ధర క్వింటాలుకు రూ.5,100 పలుకుతున్నది. మద్దతు ధర కంటే అధికంగా శనగ గతేడాది ధర పలకడంతో ఈసారి కూడా రైతులు దానిపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా.. శనగ పంట తర్వాత మక్కజొన్న, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాల పంటలను సాగు చేస్తున్నారు.
మద్దతు ధర మంచిగానే ఉంది..
యాసంగిలో శనగ పంట మంచి లాభాలను ఇస్త్తుంది. ఎకరానికి 6-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దేశవాళీ శనగ పంటను ఈ ఏడాది మా పొలంలో వేసినం. ప్రస్తుతం పూత, కాత బాగానే ఉంది. మార్కెట్లో మద్దతు ధర రూ.5,100 ఉండడంతో ఆరు క్వింటాళ్ల దిగుబడి వచ్చినా రూ.30వేల ఆదాయం వస్తది. ఎరువులు, విత్తనాలు, ఇతర ఖర్చులకు రూ. 15వేలు ఖర్చయినా మరో రూ.15 వేలు మిగులుతాయని ధీమాగా ఉంది.