
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్
ఎదులాపురం,డిసెంబర్13: ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ల జాబితాను త్వరగా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. ఓటరు నమోదు కార్యక్రమంలో గరుడ యాప్, ఓటర్ హెల్ప్‌లైన్ వినియోగం, నిధుల సద్వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన వారందరినీ ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి బంధువుల నుంచి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు. రెండు చోట్ల ఉన్న ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించి, తొలగించాలన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తిచి వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఒక పొలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి, మరో కేంద్రంలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు. భారత ఎన్నికల కమిషన్ గరుడ యాప్ రూపొందించిందని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వాలని, స్వీప్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించాలని, స్థానిక మీడియా సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పంపించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నిబంధనల ప్రకారం లెక్కింపు చేపట్టాలని సుచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు సందర్భంగా 9674 దరఖాస్తులు వచ్చాయని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వాటిని పరిశీలించి 7511 దరఖాస్తులు ఆమోదించామని, 207 అర్జీలను పలు కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. ఆమోదించిన వాటిలో 6087 దరఖాస్తులను అప్డేట్ చేశామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా పాల్గొన్నారు.