
ఆదిలాబాద్, నవంబర్ 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇప్పటికే అనేక రకాల కాలుష్యాలు పర్యావరణాన్ని పీడిస్తున్నాయి. దీనికి వరి సాగు కూడా తోడవడంతో కాలుష్య స్థాయి మరింత పెరుగుతోంది. అధిక వర్షాలు, నీటి వనరులు పెరగడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం రోజు రోజుకూ పెరుగుతోంది. అదే స్థాయిలో వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరిసాగుతో భవిష్యత్తులో నేలలు నిస్సారంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వరిని ఇష్టానుసారంగా సాగు చేయడం వలన పర్యావరణానికి ముప్పువాటిల్లుతోందని సుస్థిర వ్యవసాయ కేంద్రం (సెంటర్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చర్) నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వరిసాగు వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తోందని, పర్యావరణానికి ప్రతిబంధకంగా మారుతోందని ఈ సంస్థ వెల్లడించింది. హెక్టార్ వరి సాగుతో 1488 కిలోల కార్బన్ డయాక్సైడ్ (సీవో-2)కు సమానమైన గ్రీన్ హౌస్ గ్యాసులు (జీవోజీ) ఉత్పత్తి అవుతున్నాయని తేలింది.
పంట మార్పిడి తప్పని సరి
మన దగ్గర ఏటేటా వరి సాగు అసాధారణ రీతిలో పెరుగుతోంది. మన భూముల పరిస్థితి ఏమిటి, వాటిలో ఏ పంటలు వేసుకోవచ్చు. మన ప్రజల అవసరాలను ఏ పంటలు తీరుస్తాయి, అనే కోణంలో సాగు ప్రణాళిక చేసుకోవాలి. వరికి అవసరానికి మించి నీరు ఇవ్వడంతో వాతావరణం త్వరగా కాలుష్యమవుతోంది. ఆహార భద్రత, నేల సంరక్షణ దృష్ట్యా పంట మార్పిడి తప్పని సరిగా పాటించాలి. వరి తర్వాత ఆ పొలంలో పప్పు దినుసులు వేసుకుంటే మంచిది. లోతట్టు ప్రాంతాల్లో దొడ్డు రకం వరి కాకుండా ఇప్పుడు అందుబాటులో ఉన్న జై శ్రీరాం, తెలంగాణ సోనా వంటి అనేక రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. సన్న రకాలు పండించుకుంటే రైతే స్వయంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఒకే నేలపై రెగ్యులర్గా వరినే సాగు చేస్తామంటే రాబోయే రోజుల్లో నేల సాగుకు పనికిరాకుండా పోతుంది. భూసారం తగ్గి చౌడు భూముల సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పర్యావరణానికి తీరని నష్టం
పర్యావరణానికి వరిసాగు తీవ్రమైన నష్టం చేస్తుంది. అందరూ పచ్చని పొలాలను చూసి ఆహ్లాదంగా ఉన్నాయనుకుంటారు. కానీ, వరి పొలాల నుంచి ప్రమాదకరమైన మిథేన్ వాయువు, నైట్రేట్స్ వెలువడుతాయి. ఇది ఓజోన్ పొరను నాశనం చేస్తుంది. అలాగే, భూతా పాన్ని తీవ్రంగా పెంచేలా చేస్తుంది. దీనివల్ల మానవ సురక్షిత పర్యావరణం దెబ్బతింటుంది. వరి పొలాల వల్ల భూమి గిడుసబారుతుంది. చౌడు నేలలుగా మారుతాయి. రసాయన వాడకం వల్ల భూగర్భజలాలు కలుషితమవుతాయి. ఫలితంగా జీవకోటికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా వరి సాగు వల్ల అనేక సమస్యలున్నాయి. అందుకే వరి సాగును తగ్గించడం మంచిది.
-డాక్టర్ పీ రవి, మృత్తిక శాస్త్రవేత్త (పొలాస పరిశోధనాస్థానం)
అతిగా రసాయనాల వాడకంతో అనర్థాలు..
ఉమ్మడి జిల్లాలో రసాయనాల వాడకం విచ్చలవిడిగా జరుగుతోంది. అతిగా యూరియా వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత వానకాలం 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించాల్సి ఉండగా, 37 వేల మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఎకరానికి యూరియా 80 కిలోల వరకు వాడాల్సి ఉండగా, 150 నుంచి 200 కిలోల వరకు వినియోగిస్తున్నారు. పొలాల్లో వేసిన యూరియా భూగర్భజలాలకు చేరుకున్న తర్వాత నైట్రేట్గా మారిపోతుంది. నైట్రేట్ వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అలాగే, ఫాస్పరస్, భాస్వరం పెరిగిపోవడం వల్ల యుట్రోఫికేషన్ జరిగే ప్రమాదం ఏర్పడుతుంది.