
కార్పొరేట్ సేఫ్టీ జీఎం గురువయ్య
ఆర్కేపీ సీహెచ్‌పీ సందర్శన
రామకృష్ణాపూర్, నవంబర్ 13 : సీహెచ్‌పీల్లో రక్షణతో కూడిన బొగ్గు రవాణే లక్ష్యమని కార్పొరేట్ సేఫ్టీ జీఎం గురువయ్య సూచించారు. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సీహెచ్‌పీని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కార్మికులకు రక్షణ విషయమై పలు సూచనలు చేశారు. ప్రతి కార్మికుడి ఆరోగ్య రక్షణ మనదేనని, పనిలో, గనిలో ఎక్కడ ఏమి జరిగినా సింగరేణియే చికిత్స అందిస్తున్నదన్నారు. కార్మికులు విధులకు హాజరయ్యే తరుణంలో రోడ్డు భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని తప్పకుండా హెల్మెట్ ధరించేలా చూడడం అందరి బాధ్యత అని తెలిపారు. కార్మికుడు విరమణ పొందిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే తప్పక వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలని తెలిపారు. రోజూ 8 గంటల పాటు డ్యూటీ, 8 గంటల పాటు నిద్ర తప్పని సరి అని, మిగతా సమయం ఆరోగ్యం, కుటుంబ రక్షణే అని పేర్కొన్నారు. అనంతరం సీహెచ్‌పీ అంతా కలియతిరిగి రక్షణ సూత్రాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఆయన వెంట రీజియన్ రక్షణ అధికారి బళ్లారి శ్రీనివాస్, ఏరియా ఏజీఎం (ఈ అండ్ ఎం) రామమూర్తి, ఏఎస్వో ఓదెలు, సేఫ్టీ రీజియన్ డీజీఎం రామానాథం, ఆర్కే-1ఏ గని మేనేజర్ శ్రీధర్‌రావు, రక్షణ అధికారి జయంత్, ఇన్చార్జి ఇంజినీర్ అశోక్‌రెడ్డి, పిట్ కార్యదర్శులు జే శ్రీనివాస్, సంజీవ్, సూపర్ వైజర్లు కల్లెపల్లి శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది కృష్ణాపూర్, నరేంద్ర, శ్రీకాంత్ పాల్గొన్నారు.