
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 13: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలికల గురుకుల కళాశాల ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి విద్యార్థీ చదువుతో పాటు, చట్టాలను, సమాజంపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు జాతీయ జాతీయ న్యాయ సేవా సంస్థ ఆదేశాలతో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లాలో అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు విద్యా సంస్థల్లో, గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పాల్ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి భూమారెడ్డి, పీఎస్సై హైమ, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మౌనిక, న్యాయవాదులు కారుకూరి సురేందర్, రెడ్డిమల్ల ప్రకాశం, వేల్పులు సత్యం, మేదరి పాల్సన్, మల్లికార్జున్, శివశంకర్, నీరజ, యశోధర, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలో..
మంచిర్యాల అర్బన్, నవంబర్ 13 : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ, రాళ్లపేట, శ్రీ సాయినగర్, ముస్లీంబస్తీ, ఏసీసీ కాలనీ, శ్రీశ్రీ నగర్, క్యాబిన్ ఏరి యా, గర్మిళ్ల, వేముల బస్తీ, ఆంధ్రాకాలనీ, నస్పూర్ మండలంలోని తీగల్‌పహాడ్, నస్పూర్‌లోని 1, 5 వార్డులు, సాయి నగర్, ఆర్అండ్ఆర్ నగర్లో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సదస్సుల్లో ప్యానల్ న్యాయవాది మేకల రాజన్న, ఎండీ తాజొద్దీన్, న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.