
ఆదిలాబాద్ డీఈవో ప్రణీత
తలమడుగు, నవంబర్ 11 : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. మండలంలోని బరంపూర్ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి, చిన్నారులు చేసిన దాండియా, గుస్సాడీ, బుర్ర కథలు కట్టిపడేశాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు నృత్య పోటీలతో పాటు క్విజ్, వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు డీఈవో బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం డీఈవో మాట్లాడూతూ.. మండలస్థాయిలో అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా వివధ రంగాల్లో ప్రతిభ కనబర్చాలని పేర్కొన్నారు. అతిథులకు శాలువా, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. సర్పంచ్ భాగిర్థాబాయి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణ కుమార్, కూడల రవీందర్, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మహేందర్ యాదవ్, నర్ర నవీన్ యాదవ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు కేదారేశ్వర్ రెడ్డి, ఎంఈవో నారాయణ, ఉపాధ్యాయు లు, పీఆర్టీయూ నాయకులు పాల్గొన్నారు.