తాండూర్, అక్టోబర్ 13 ;ఓపెన్‌కాస్టుల్లో భూములు కోల్పోయిన వారికి సింగరేణి యాజమాన్యం అన్ని రకాలుగా అండగా ఉంటున్నది. తమ సంస్థల్లో భూములు పోయిన వారికి డబ్బులు చెల్లించడమే కాకుండా ఆర్అండ్ఆర్ కాలనీలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. వారికి ఎక్కడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నది. తాండూర్ మండలంలోని అబ్బాపూర్ ఓపెన్‌కాస్టుల్లో భూములు, ఇండ్లు కోల్పోయిన గిరిజనులకు రూ.2 కోట్లతో అద్భుతమైన ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేసింది. త్వరలో దీనిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ, డోర్లీ-1, డోరీ-2 ఓపెన్‌కాస్ట్ గనుల్లో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి ఆర్అండ్ఆర్ సెంటర్లు నిర్మించి అందులో సౌకర్యాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నది. బీపీఏ ఓసీపీ-2 (అబ్బాపూర్) ఓపెన్‌కాస్ట్ గనిలో తాండూర్ మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన వారు తమ ఇండ్లు, భూములు కోల్పోయారు. వారికి నర్సాపూర్ వద్ద నర్సాపూర్ ఆర్ అండ్ ఆర్ సెంటర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు మొత్తం పూర్తయ్యాయి. అబ్బాపూర్ గ్రామంలో 66 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారికి పునరావాసం కోసం నర్సాపూర్ గ్రామానికి సమీపంలో కొత్తగా అబ్బాపూర్ ఆర్ అండ్ ఆర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.2 కోట్లతో ఇక్కడ పనులు పూర్తి చేశారు. రూ.30 లక్షలతో సుమారు 12 ఎకరాల స్థలం కొనుగోలు చేసి 96 ప్లాట్లు ఏర్పాటు చేశారు. అందులో రూ.1 కోటితో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, రూ.25 లక్షలతో కమ్యూనిటీ భవనం, రూ.25 లక్షలతో తాగునీటి ట్యాంకు, రూ.5 లక్షలతో బోర్వెల్ పంపులు, రూ.10 లక్షలతో విద్యుత్ స్తంభాలు, మిగిలిన ప్లాట్ల మధ్యలో బడి, గుడి, పార్కుకు స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టారు. అన్ని పూర్తి కాగా, కేవలం వాటర్‌ట్యాంకు పనులు మాత్రం కొనసాగుతున్నాయి.
పనులు చకచకా చేస్తున్నరు..
సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో ఇండ్లు కోల్పోతున్న మాకు ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేసి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థకు పెద్దపీట వేయడంతో పాటు నిర్వాసితు లకు ఎలాంటి అన్యాయం జరగవద్దనే ఆదేశాలు ఉండడంతో తమకు పూర్తి న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. అన్ని నిర్మించారు.. కేవలం వాటర్ ట్యాంకు కడితే అన్ని సౌకర్యాలు సమకూరుతాయి. భూములు, ఇండ్లు కోల్పోతున్న వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ప్రోత్సాహం అందించాలి.
-కుర్సెంగ జంగుబాయి, సర్పంచ్, నర్సాపూర్