
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: నాగుల పంచమి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి, వినాయక్చౌక్, డైట్ కళాశాల, రాంనగర్, శ్రీగోపాలకృష్ణ మఠంలో పాముల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడిగుడ్లు, జొన్న ప్యాలాలు, పాలతో పూజలు చేశారు. అనంతరం మహిళలు తమ అన్నదమ్ముల కళ్లను పాలతో కడిగి ఆశీర్వదించారు. భక్తులు భారీగా తరలిరావడంతో డైట్ కళాశాల మైదానంలో పండుగవాతావరణం నెలకొంది.
బోథ్, ఆగస్టు 13: మండలంలో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోథ్, సొనాల, కౌఠ (బీ), ధన్నూర్ (బీ), పొచ్చెర, కన్గుట్ట, కుచ్లాపూర్, పట్నాపూర్, మర్లపెల్లి తదితర గ్రామాల్లోని భక్తులు పాముల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పిల్లాపాపలతో కలిసి పుట్టలో పాలు పోశారు. అక్కాచెళ్లెళ్లు అన్నదమ్ముల కళ్లను పుట్టల్లో పోసిన పాలతో కడిగారు. బంజారా, మథురతండాల్లో ఊయల కట్టి ఊగారు.
గుడిహత్నూర్, ఆగస్టు 13: మండలంలో శుక్రవారం నాగులపంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉన్న పుట్ట వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేసి పుట్టలో పాలు పోశారు. ఒకరికొకరు కుంకుమ బొట్టు పెట్టుకొని పంచమి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మండలంలోని మచ్చాపూర్, ధమన్గూడలోని నాగదేవత గుడి భక్తులతో కిక్కరిసిపోయింది. ఇంటి వద్ద ఆడపడుచులు తమ తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్లకు కండ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం ఇంటి ముందర ఊయల కట్టుకొని ఊగుతూ పాటలు పాడారు.
నార్నూర్,ఆగస్టు13;నార్నూర్,గాదిగూడ మండలలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు నిర్వహించారు.గ్రామీ సమీపంలోని పాము పట్టుల వద్ద నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టలో పాలు పోశారు. ఇంటివద్ద తయారు చేసిన వివిధ రకాల పదార్థాలు నైవేద్యంగా సమర్పించి, మొక్కులు చెల్లించారు. మహిళలు, యువతులు గ్రామాల్లో ఊయల ఊగుతూ సంప్రదాయ పాటలతో ఆడిపాడారు.
ఇచ్చోడ, ఆగస్టు 13 : ఇచ్చోడ, కోకస్మన్నూర్, గేర్జం, నర్సాపూర్, ధరంపురి, నవేగావ్, ముక్రా (కే), బోరిగామ, జామిడి, జున్ని తదితర గ్రామాల్లోని ఆలయాల్లో మహిళలు, యువతులు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో నాగ దేవతకు పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా గ్రామాల్లో సంప్రదాయ పాటలు పాడుతూ ఊయలలు ఊగారు.
బజార్హత్నూర్, ఆగస్టు 13 : బజార్హత్నూర్ మండలంలో శుక్రవారం నాగుల పంచమి వేడుకలను జరుపుకొన్నారు. మహిళలు పుట్టల వద్దకు చేరుకుని పూజలు చేశారు. మహిళలు, యువతులు ఊయలలు ఊగారు.
భీంపూర్, ఆగస్టు 13: మండలంలోని మహిళలు గ్రామ శివార్లలోని పుట్టల వద్ద పూజలు చేశారు. గంగపుత్రులు నాగదేవతను ప్రార్థించారు.
బేల, ఆగస్టు 13: మండలంలోని బేల, డోప్టాల, జూనోని, చప్రాల, సిర్సన్న, సాంగిడి తదితర గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం జరుపుకొన్నారు. మహిళలు గ్రామ శివారుల్లో ఉన్న పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ వనితా ఠాక్రే, జడ్పీటీసీ అక్షితాపవార్, సర్పంచులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ, ఆగస్టు 13: మండల కేంద్రతో పాటు రిమ్మ, పాండుగూడ, కన్నాపూర్, రాయిగూడ, సోంపల్లి, పొచ్చంపల్లి ధర్మసాగర్ తదితర గ్రామాల్లోని నాగదేవత ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు13: మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని మహిళలు పాముల పుట్టల వద్దకు పాలుపోసి ప్రత్యేక పూజలు చేశారు. యువతులు ఉయ్యాలూగుతూ సందడి చేశారు.
ఉట్నూర్, ఆగస్టు 13 : మండలంలో నాగేంద్రుని ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పూజారులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు నాగేంద్రుని ప్రాముఖ్యత వివరించారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జైనథ్, ఆగస్టు1: మండలంలో శుక్రవారం నాగులపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగసర్పదోష నివారణ మంత్రాలను పఠించారు. జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, ఎంపీపీ మార్శెట్టి తదితరులు పాల్గొన్నారు.