
రేపటి నుంచి పరీక్షల నిర్వహణ
హాజరుకానున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు
ప్రశ్నాపత్రాలు తీసుకెళ్లాలని డీఈవో ఆదేశం
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 12 : ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఎస్ఏ-1 పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయడానికి ఈ ఎస్ఏ పరీక్ష ఎంతగానో దోహదం చేయనుంది. కొవిడ్ కారణంగా పదోతరగతి విద్యార్థులను ఈ పరీక్ష ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు నిర్వహించనున్న ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డి తెలిపారు.
హాజరుకానున్న 1,28,819 మంది విద్యార్థులు..
ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులు సామర్థ్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు ఎంతగానో దోహదపడనున్నాయి.జిల్లాలోని 579 ప్రాథమిక, 99 ప్రాథమికోన్నత, 145 ఉన్నత పాఠశాలలతో పాటు 18 కేజీబీవీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి మొత్తం 71,265 మంది, 205 ప్రైవేట్ పాఠశాలల్లోని 57,554 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానుండగా.. మొత్తం జిల్లా వాప్తంగా 1,28, 819 మంది విద్యార్థులకు సరిపడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పదోతరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు అత్యంత ప్రామాణికం కాగా.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పరీక్షలకు సన్నద్ధం చేశారు.
పరీక్షా సమయం ఇదే..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఆరు, ఏడు తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.45 గంటల వరకు, ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.45 గంటల వరకు, పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 1.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
నేటి నుంచి ప్రశ్నాపత్రాల పంపిణీ..
ఎస్ఏ-1 పరీక్షకు సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం నుంచి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను పంపిణీ చేయనున్నారు. నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, సోన్, సారంగాపూర్, మామడ, లక్ష్మణచాంద మండలాల పాఠశాలలకు పట్టణంలోని జుమ్మెరాత్పేట్ పాఠశాల నుంచి ప్రశ్నాపత్రాలు తీసుకెళ్లాలని డీఈవో సూచించారు. నర్సాపూర్(జీ), దిలావర్పూర్, కుంటాల, లోకేశ్వరం వారు నర్సాపూర్(జీ) ఉన్నత పాఠశాల నుంచి, భైంసా, కుభీర్ వారు ఆశ్రమ పాఠశాల భైంసా నుంచి, ముథోల్, తానూర్, బాసర వారు జడ్పీహెచ్ఎస్ ముథో ల్ నుంచి తీసుకెళ్లాలని తెలిపారు. ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి మండలాల వారు ఖానాపూర్ హైస్కూల్ నుంచి ప్రశ్నాపత్రాలను తీసుకెళ్లాలని పేర్కొన్నారు.