
కోటపల్లి, డిసెంబర్ 12 : వర్షాకాలం వస్తేనే వణుకు. చిన్నపాటి వానకే ఉప్పొంగి మత్తడి దుంకే తుంతుంగా చెరువు. రోజుల తరబడి రాకపోకలు నిలిచి స్తంభించే జనజీవనం. ఇన్నాళ్లూ నరకం అనుభవించిన ఆ 10 గ్రామాల ప్రజల కష్టాలకు త్వరలోనే చెక్ పడనున్నది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 8 కోట్లు మంజూరు కాగా, వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది. ఎట్టకేలకు దశాబ్దాల కల నెరవేరబో తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదుల్లబంధం గ్రామ సమీపంలో తుంతుంగా చెరువు ఉంది. ఏటా వర్షాలు కురిసినప్పుడల్లా ఈ చెరువు ఉప్పొంగి మత్తడి దుంకడం వల్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. అవతల ఉన్న ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపాక, కొత్త సూపాక, వెంచపల్లి, నందరాంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఆయా గ్రామాలు రోజుల తరబడి జల దిగ్బంధంలో చిక్కుకుని బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదైనా ఆపద వస్తే ఇక అంతే సంగతులు. తుంతుంగ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో పది గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గతేడాది ఆగస్టు 17న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి స్వయంగా వెళ్లి వాగు ఉధృతిని పరిశీలించారు. ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించారు. బ్రిడ్జి నిర్మాణానికి ఫిబ్రవరి(2021)లో రూ.8 కోట్లు మంజూరు కాగా, ఏప్రిల్ 27న శిలాఫలకం ఆవిష్కరించి పనులు ప్రారంభించారు.
ప్రభుత్వ విప్ ప్రత్యేక చొరవతో..
2020, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు తుంతుంగా చెరువు మత్తడి దుంకింది. వాగు ఉధృతంగా ప్రవహించింది. అదే సమయంలో సిర్సా గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. చేసేదేమీ లేక గర్భిణి ఒడ్డున ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ రవికుమార్ అతికష్టంమీద ట్రాక్టర్ సాయంతో ఆమెను వాగు దాటించారు. తల్లీ బిడ్డలను కాపాడారు. అప్పట్లో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల సాహసానికి ప్రశంసల జల్లు కురిసింది. మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, డీజీపీ మహేందర్ రెడ్డి కోటపల్లి పోలీస్ సేవలను ప్రశంసించారు. ఈ క్రమంలో సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భావించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన సర్కారు చెరువు మత్తడి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరు చేసింది.
విప్ సుమన్‌కు రుణపడి ఉంటాం
ఏటా వర్షాకాలంలో తుంతుంగా చెరువు మత్తడి దుంకుతుంది. దీంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి. ఏదైన రోగమో. నొప్పో వస్తే ఇగ అంతే సంగతులు. మా బాధలను విప్ బాల్క సుమన్ కళ్లారా చూశారు. వెంటనే స్పందించి ప్రభుత్వం నుంచి బ్రిడ్జి కోసం నిధులు మంజూరు చేయించారు. ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. మరో ఏడాది లోపు పూర్తి చేస్తరని చెబుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పది గ్రామాల ప్రజల కష్టాలు తీరినట్లే. విప్ బాల్క సుమన్‌కు మేమంతా రుణపడి ఉంటాం.
ఇగ మా కష్టాలన్నీ తీరిపోయినట్లే
తుంతుంగా చెరువు మత్తడి వద్ద బ్రిడ్జి లేక మస్తు తిప్పల పడుతున్నం. వానకాలంలో చెరువు మత్తడి దుంకితే ఇగ ఎటూ పోలేని పరిస్థితి. ఏటా ఇవే బాధలు. మా కష్టాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు చెప్పుకున్నం. ఆయన కూడా ప్రత్యక్షంగా చూశారు. బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని మాట ఇచ్చి వెంటనే సర్కారు నుంచి నిధులు మంజూరు చేయించారు. ఇప్పుడు పనులు కొనసాగుతున్నాయి. ఇగ మా కష్టాలన్నీ తీరిపోయినట్లే.