
రెండు నెలల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు
పుణ్యక్షేత్రాల్లో వేడుకగా బోనాలు, పట్నాలు, ఒగ్గు కథలు
పల్లెల్లో మొదలైన షష్ఠి బోనాల సందడి
నెన్నెల, డిసెంబర్ 12 : పల్లెల్లో మల్లన్న బోనాల సందడి మొదలైంది. గ్రామాలు, పుణ్యక్షేత్రాల్లో రెండు నెలల పాటు జరగనున్న శివ మల్లన్న పట్నాలు, బోనాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఏటా మార్గశిర మాసంలో ఉత్సవాలు మొదలై శివరాత్రి వరకు కనుల పం డువగా సాగుతాయి. షష్ఠి అమవాస్య మొదటి ఆదివారం నుంచి శివమల్లన్న బోనాలు, పట్నాలు, ఒగ్గుకథలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు మొదట ఇం టి బోనం నిర్వహించి ఆ తర్వాత ఆలయాల్లో మొక్కులు తీర్చుకుంటారు.
బోనాల వారం..
షష్ఠి అమవాస్య ప్రారంభమైన రోజు నుంచి బోనాలు నిర్వహిస్తారు. అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఇంటి వద్ద బోనాలు నిర్వహిస్తారు. బోనాలు నిర్వహించే తిరుగు వారం అయ్యే వరకు ఇంట్లోని వారు పాలు, పెరుగు, టీ ముట్టకోరు. ఇంట్లో ఉన్న ఆవులు, బర్రెల పాలను మడి కట్టి పితుకుతారు. పితికిన పాలను మట్టి పొయ్యిల మీద కుండలో పోసి వేడి చేస్తారు. వాటి ద్వారా నెయ్యి తీసి దేవునికి సమర్పిస్తారు. మగ వారు క్షవరం చేసుకోరు. మందు.. మాంసానికి దూరంగా ఉంటారు. పొలంలో పండిన ధాన్యాన్ని తీసి బియ్యం పట్టించి.. వాటితో బోనం వండుతారు. నైవేద్యం, పాయసాన్ని ఇత్తడి లేదా మట్టి పాత్రల్లోనే వండుతారు. వండిన బోనాలకు గంధం, పసుపు పూసి పూలతో అలంకరిస్తారు. దేవుడికి పెట్టే నైవేద్యం కోసం కూరగాయాలతో కూర వండుతారు. పోపు వేయరు. ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోని గద్దెలపై మల్లన్న ప్రతిమలను ఉంచుతారు. ప్రతిమల ముందు బోనాలను ఉంచి మొక్కులు చెల్లిస్తారు. ఇలా మొదటి వారం నియమాలతో ఉండి ఇంటి మల్లన్నకు బోనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత శివ మల్లన్న ఆలయానికి వెళ్లి అక్కడ బోనాలు సమర్పిస్తారు. ఆది, బుధవారాల్లో బోనాల సందడి ఉంటుంది.
భక్తి శ్రద్ధలతో పట్నాలు
ఇంటిలో బోనాలు పోసి మొక్కులు చెల్లించుకున్న వారు తమ ఇంటి వద్దే కాకుండా ఆలయాల్లోనూ దేవుడి పట్నాలు, ఒగ్గుకథలు, శివ మల్లన్న కల్యాణం నిర్వహిస్తారు. మూడు రోజులు, ఏడు రోజులు కథలు చెప్పి పట్నాలు వేస్తారు. పట్నాలను అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక నైపుణ్యం గల ఒగ్గు పూజారులు పసుపు, బియ్యం పిండి, తంగేడు ఆకుతో తయారు చేసిన పచ్చ పిండి, కుంకుమలను కలిపి రంగులను తయారు చేసుకుంటారు. పలకల్లో రంగులను నింపి వివిధ రూపాల్లో పట్నం వేస్తారు. స్వామి వారి కల్యాణం,నాగవెల్లి ఘట్టాలను ఆవిష్కరించేలా తయారు చేస్తారు.
జిల్లాలోని పుణ్య క్షేత్రాల్లో..
మల్లిఖార్జునుడిని పరమ శివుడి ప్రతి రూపంగా కొలుస్తారు. పల్లెల్లోని ఆలయాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మల్లన్న పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. చెన్నూర్‌లోని కత్తెరసాల మల్లన్న ఆలయం, జైపూర్ మండలంలోని గట్టుమల్లన్న ఆలయం, బెల్లంపల్లిలోని బుగ్గరాజ రాజేశ్వర స్వామి ఆలయం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఈజ్గాం శివ మల్లన్న ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ పట్నాలు, కల్యాణాలు నిర్వహిస్తారు. బోనాలు, అన్న సంతర్పణలు చేపడుతారు. ప్రతి ఆది, బుధవారాల్లో బోనాలు, కథలు, పట్నాలతో రెండు నెలల పాటు సందడి నెలకొంటుంది.
మల్లన్న కల్యాణం..
మల్లన్న పట్నాలను కథను బట్టి మూడు నుంచి ఏడు రోజుల పాటు నిర్వహిస్తారు. స్వామి వారి ప్రతిమలను మూట గట్టి తలపై పెట్టుకుని పిల్లన గ్రోవి, ఢమరుకం వాయిద్యాల నడుమ గోదావరి పుణ్యస్నానానికి వెళ్తారు. గోదావరిలో ప్రతిమలను శుభ్రం చేసి అక్కడే ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి వచ్చి అలంకరించిన కుండల (కూరాల్లు)తో డోలు వాయిద్యాల నడుమ ఆటపాటలతో పుట్టవద్దకు వెళ్తారు. పుట్ట వద్ద ప్రత్యేక పూజ లు చేసి కొత్త గంపలో పుట్ట బంగారం(మట్టి) తెచ్చి స్వామి వారి గద్దెను తయారు చేస్తారు. పుట్ట మట్టిని తడిపి నేలపై అలికి దానిపై పట్నం వేస్తారు. పట్నంపై స్వామి వారి ప్రతిమలను ఉంచి మల్లికార్జునుడి వివాహ కథగా చెబుతారు. కథతో పాటు అక్కడే కల్యాణం నిర్వహిస్తారు. కథ పూర్తయిన త ర్వాత నాగవెల్లి పట్నం వేసి మొక్కులు చెల్లిస్తారు.