
వేమనపల్లి, డిసెంబర్ 12 : ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రామగుండం ఓఎస్డీ శరత్‌చంద్రపవార్ పేర్కొన్నారు. ఆదివారం వేమనపల్లి మండల కేంద్రం సమీపంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జైపూర్ ఏసీపీ నరేందర్‌తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం మారుమూల వేమనపల్లి మండలంలో నక్సల్స్ ప్రాబల్యం ఉండేదని, దీంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఇప్పుడిప్పుడే రోడ్లు, వంతెనల నిర్మాణాలు, సంక్షేమ పథకాల అమలుతో ప్రగతి బాట పడుతున్నదన్నారు. మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలు ఉన్నందున, వారికి ఎవరూ సహకరించవద్దని సూచించారు. ప్రాణహిత నది సరిహద్దులో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి ప్రతినిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు. యువకులు వ్యసనాలకు బానిస కాకుండా చదువుతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రామగుండం సీపీ చంద్రశేఖర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో మారుమూల ప్రజల ఆరోగ్యం కోసం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరానికి మంచిర్యాలలోని దవాఖానల వైద్యులు వచ్చి సేవలందించడం సంతోషంగా ఉందని తెలిపారు. శిబిరంలో వసతులు కల్పించిన చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజును, నీల్వాయి ఎస్ఐ రహీంపాషాను ఓఎస్డీ అభినందించారు. ఈ శిబిరంలో దాదాపు 300 మందికి పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. అంతకుముందు ఓఎస్డీ యువకులకు వాలీబాల్, క్రికెట్ కిట్లు, 200 మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. రోగులకు వాహన సౌకర్యంతో, భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ మల్లేశ్, వైద్యులు వెంకటేశ్వర్లు, రవీంద్రప్రసాద్, రాజగోపాల్, రమేశ్‌బాబు, హన్మంత, రఘునందన్, రాకేశ్‌రెడ్డి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ తొగారు సుధాకర్, సర్పంచు తాటికొండ రాజేశ్వరి, ఎస్ఐలు, పోలీసులు, ప్రజాప్రతినిధులున్నారు.