
సాగులో మార్పు దిశగా రైతులు
గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
లోకేశ్వరం, డిసెంబర్12 : ఇతర పంటలు సాగు చేసే దిశగా రైతులు మందుకు సాగుతున్నారు. లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గతానికి భిన్నంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఇతర పంటలకు సంబంధించిన వివరాలను రైతులు తెలుసుకున్నారు. వరికి బదులుగా మిర్చి, పసుపు, పప్పు దినుసులు, వేరుశనగ, కంది పంటతో పాటు లాభసాటిగా ఉండే కూరగాయలను విరివిగా పండిస్తున్నారు. ఇతర పంటల సాగుతో లాభాలు సైతం ఆశించిన స్థాయిలో వస్తుండడంతో రైతులు అటు వైపు మొగ్గు చూపుతున్నారు. వరి సాగుతో పాటు ఇతర పంటలు సాగు చేయాలని పదే పదే ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతులు సైతం ఇతర పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. గతంలో అవసరమైన విత్తనాలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం రైతులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే రైతులకు ఇతర పంటల సాగుతో కలిగే లాభాలు వివరించేందుకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తుండడంతో మార్పు కనిపిస్తున్నది. గతంలో కంటే ఇప్పుడు మండలంలో ఇతర పంటల సాగు విస్తీర్ణం పెరిగిపోయింది. కూరగాయల సాగు లాభసాటిగా ఉండడంతో రైతులు తమ పంట పొలాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. స్థానికంగా కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అవసరమయ్యే సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా పంట మార్పిడి ప్రాముఖ్యతను సైతం అధికారులు రైతులకు వివరిస్తున్నారు. భూసార పరిరక్షణకు పంట మార్పిడి సైతం ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వం ఇతర పంటల సాగుపై రైతులను ప్రోత్సహించడంపై మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.