
సిరికొండ/దస్తురాబాద్, డిసెంబర్ 12 : అధిక చలి, ఈదురు గాలులతో పశువులకు జీర్ణ వ్యవస్థ మందగించడం, ఆహారం తీసుకోక అవస్థలు పడుతాయి. పోషక పదార్థాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆవులు, బర్రెలు గాలికుంటు వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పాడి రైతులు సకాలంలో ఈ వ్యాధి ని గుర్తించి నివారణ టీకాలు వేయించాలని పశు వైద్యులు సూచిస్తున్నారు. టీకాలు వేయించకుండా నిర్లక్ష్యం చేస్తే పాడి పశువులు అనారోగ్యానికి గురై మరణిస్తాయి.
వ్యాధి సోకితే బలహీనంగా…
గాలికుంటు అంటువ్యాధి. పికార్నో వైరస్ స్ట్రెయిన్ల వల్ల ఈ వ్యాధి సోకడంతో మరణాల శాతం తక్కువైనప్పటికీ పశువులలో ఎదుగుదల లోపించి, బలహీనతకు లోనవుతుంటాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పశువుల్లో గాలికుంటు ఎక్కువగా సోకుతుంది.
లక్షణాలు..
గాలికుంటు వ్యాధితో బాధపడుతున్న పశువు, బర్రె శరీర ఉష్ణోగ్రత 104-106 డిగ్రీల మధ్య ఉంటుంది. నోటి, పళ్లచిగుళ్లు, నాలుక లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడుతాయి. 24 గంటల్లో అవి చితికిపోయి మేత తినవు, నోటి నుంచి నురుగకార్చడం, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి ఆ తర్వాత చితికిపోడవంతో నడవలేక పోతుంటాయి. పొదుగుపై బొబ్బలు ఏర్పడి, ఒక్కొక్కసారి పొదుగు వాపు సంభవించి, చీముతో కూడిన పుండ్లు తయారవుతాయి. వ్యాధి సోకిన పశువుల పాలు తాగి దూడలు మరణించే అవకాశం ఉంది. దున్నే ఎద్దులు పనులకు ఉపయోగపడవు. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుంది. పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. వ్యాధిగ్రస్త పశువులు 2, 3 రోజుల్లో మేత తినడం ప్రారంభించిన వ్యాధి వల్ల కలిగే దుష్పలితాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. పశువులు రక్తహీనత కలిగి శ్వాస కష్టంగా పీల్చుతూ, బుసకొడుతూ, ఎండవేడిమి తట్టుకోలేక నిరసించి పోతాయి.
నివారణ..
పుండ్లను పర్మాంగనేట్ ద్రావణంతో కడగవచ్చు. నోటి పుండ్లు బోరోగ్లిజరిన్, కాల పుండ్లను జింక్ ఆక్సైయిడ్, లోరాక్సిన్, హి మాక్స్ వంటి మందులు వాడాలి. ఈగలు వాలకుండా వేపనూనె, నిమ్లెంట్ వంటి మందులు వాడాలి. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మొదటి సారి 2 నెలలో వయస్సులో, బుస్టర్ డోస్ ఒక నెల తర్వాత వేయించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం తప్పనిసరిగా టీకా వేయించాలి. టీకా వేసిన తర్వాత 1 నుంచి 3 వారాల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. సంవత్సరకాలం వరకు వ్యాధి సోకకుండా ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3.11 లక్షల ఆవులు, ఎడ్లు, 50 వేల బర్రెలు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా పశువులకు వ్యాక్సిన్ పూర్తి చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లాలో 1 ఏరియా పశు వైదశాల, 3 మండల వెటర్నరీ డిస్పెన్సర్లు, 22 గ్రామీణ పశువైద్య కేంద్రాలు, 12 కేంద్రాల ద్వారా పశుసంవర్ధకశాఖ సహాయకులు సేవలందిస్తున్నారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో 16 వేల పశువులు ఉండగా ఇప్పటి వరకు మొత్తం 12,733 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశామని వైద్యులు తెలిపారు. త్వరలోనే మిగతా పశువులకు టీకాల వేస్తామని పేర్కొన్నారు.
పశువులకు టీకాలు వేస్తున్నాం
రైతులు, పశు యాజమానులు పశుసంపదను కాపాడుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు తప్పనిసరిగా పశువులకు టీకాలను వేయించాలి. పాడి రైతులు పశు సంపదపై దృష్టి సారించాలి. మండలంలోని అన్ని గ్రా మాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా గాలికుంటు టీకాల కార్యక్రమం ప్రారంభించాం. మండలంలో 16 వేల పశువులు ఉండగా, ప్రస్తుతం 12733 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశాం. మిగిలిన వాటికి కూడా వేస్తు న్నాం. రైతులు, పశు యాజమానులు పశువులకు వ్యాధులు వస్తే వాటిని గుర్తించి వైద్యులకు సకాలంలో సమాచారం అందించి కాపాడుకొండి.
-జాదవ్ దేవీదాస్, వెటర్నరీ అసిస్టెంట్, దస్తురాబాద్