
యార్డుల్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు
మార్కెట్ చెక్‌పోస్టులు ప్రారంభం
ఉమ్మడి జిల్లాలో 18 మార్కెట్ యార్డులు
ఆదిలాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర సర్కారు సాగు చట్టాలను రద్దు చేయడంతో మార్కెట్‌కు ఆదాయం సమకూరనుంది. క్రయవిక్రయాలు జరగనుండడంతో మార్కెట్ యార్డులకు సెస్ రూపంలో డబ్బులు, చెక్‌పోస్టులకు ఒక శాతం పన్ను రానుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18 మార్కెట్ యార్డులు ఉండగా.. నల్ల చట్టాలు అమలు చేయకముందు రూ.కోట్లలో ఆదాయం వచ్చేది. అమలు చేసిన తర్వాత మార్కెట్లకు పంట ఉత్పత్తులు రాక.. అమ్మకాలు, కొనుగోళ్లు జరుగక వెలవెల బోయాయి. రైతుల ఆందోళనతో మోదీ సర్కారు వెనక్కి తగ్గడంతో మళ్లీ మార్కెట్లు పూర్వవైభవం సంతరించు కోనున్నాయి. ఫలితంగా ఆదాయం కూడా రానుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటిలో ఆదిలాబాద్ జిల్లాలో 5, నిర్మల్‌లో 5, మంచిర్యాలలో 5, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3 చొప్పున ఉన్నాయి. వీటికి వానకాలం, యాసంగిలో రైతు లు పండించిన పంటను తీసుకొస్తే.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కొనుగోలు చేసేవి. వీరు క్రయ, విక్రయాలు జరిపినందుకు మార్కెట్ యార్డుకు సెస్ రూపంలో డబ్బులు చెల్లించేవారు. పంట ఉత్పత్తులను ఒక చోటు నుంచి మరోచోటుకి తరలించేటప్పుడు కూడా ఆయా ప్రాంతాల పరిధిలో ఉండే చెక్‌పోస్టుల్లో ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది. ఈ విధంగా మార్కెట్లకు బాగా ఆదాయం సమకూరేది. కాగా.. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల వల్ల మార్కెట్లకు ఆదాయం లేకుండా పోయింది. రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉండడంతో మార్కెట్లు వెలవెలబోయాయి. ఆదాయం లేకుండా పోయింది. తద్వారా రైతుల ఆందోళనతో కేంద్ర సర్కారు దిగొ చ్చి నల్లచట్టాలను రద్దు చేసింది. ప్రస్తుతం మళ్లీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్ల ద్వారా గతేడాది రూ.9.22 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.14.16 కోట్ల ఆదా యం సమాకూరింది. నిర్మల్ జిల్లాలో రూ.5.50 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.7.31 కోట్లు, మంచిర్యాల జిల్లాలో రూ.8.35 కోట్ల ఆదాయం మార్కెట్లకు వచ్చింది. సాగు చట్టాల కారణంగా మార్కెట్ల బయట జరిగే క్రమ విక్రయాలపై ఎలాంటి సెస్ వసూలు చేయవద్దనే నిబంధన ఉండడంతో వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీ కేంద్రాలను మూసివేశారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలు రద్దు కాగా తనిఖీ కేంద్రాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. పంట ఉత్పత్తులు అమ్మకాలు, కొనుగోళ్లు మార్కెట్ యార్డుల పరిధిలో జరుగనున్నాయి. మార్కెట్లకు పత్తి, సోయా, ధాన్యం రావడంతో కళకళలాడుతున్నాయి.