
ఆదిలాబాద్, నవంబర్ 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి):యాసంగి వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం టీఆర్ఎస్ చేపట్టిన ధర్నా విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయా జిల్లాల కలెక్టరేట్లు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు టీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ర్యాలీలు తీస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ సర్కారు తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ఆ పార్టీ స్థానిక నేతలు మోసపూరిత విధానాలను మానుకోవాలని హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లపై వెంటనే తేల్చాలని ఆల్టిమేటం జారీ చేశారు. నిర్మల్‌లో మంత్రి ఐకేరెడ్డి, చెన్నూర్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం టీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులు కదం తొక్కారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వడ్లు కొనమని కేంద్రం చెబుతుంటే, స్థానిక బీజేపీ నాయకులు మోసపూరిత మాటలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆయా చోట్ల నిర్వహించిన ధర్నాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో తరలివచ్చారు. ధాన్యం కొనాల్సిందేనని వరి గొలుసులు పట్టుకొని నినదించారు. పలు మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిలాల్లోని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కార్యక్రమాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంత్రి ఐకేరెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో ఎమ్మెల్యే జోగురామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, టీడీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ జీ నగేశ్‌తో కలిసి పాల్గొన్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే కేంద్రం వడ్లు కొనేలా ఒప్పించాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల, నవంబర్ 12, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు మోటపల్కుల గురువయ్య నియోజకవర్గానికి చెందిన రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. సభ ప్రారంభమయ్యాక ఇటీవల గనిలో మృతి చెందిన నలుగురు సింగరేణి కార్మికులకు నివాళులర్పించి నిమిషం పాటు మౌనం పాటించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ, నలుగురు బీజేపీ ఎంపీల దిష్టి బొమ్మలను దహనం చేశారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ భారతీ హోళికేరికి వినతిపత్రం అందజేశారు. చెన్నూర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వడ్లు కొంటామని ప్రకటించే వరకూ తగ్గేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెల్లంపల్లిలో నియోజకవర్గ కేంద్రంలోని కాంటా చౌరస్తా వద్ద తలపెట్టిన టీఆర్ఎస్ ధర్నా కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి రైతులు,ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాంటా చౌరస్తా గులాబీమయమైంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తీశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు రైతులతో కలిసి పూలమాలలు వేశారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టే వరకూ ఉద్యమిస్తామన్నారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ైప్లె ఓవర్ మీదుగా గులాబీ జెండాలు చేతబూని కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రధాన వీధులగుండా సుమారు రెండు గంటల పాటు బైక్ ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వడ్లు కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ఆదుకుంటుంటే.. కేంద్రం అణగదొక్కుతుంది
మంచిర్యాల అర్బన్, నవంబర్ 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తూ ఆదుకుంటుంటే.. కేంద్ర సర్కారు అరిగోస పెడుతుంది. నాకు పది ఎకరాల భూమి ఉంది. అందులో వరి సాగు చేసిన. వేరే పంటలు అక్కడ పండవు. అమ్ముదామంటే కాలికేత్తె మెడకు, మెడకేత్తె కాలికేస్తూ సవాలక్ష కారణాలు చెబుతున్రు. కొనం అంటే మేం వడ్లను ఎక్కడ అమ్ముకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు రైతుల కష్టం తెలుసు. అందుకే పెట్టుబడికి ఎకరాకు మొదుగాల రూ. 4 వేల చొప్పున ఇచ్చారు. కేంద్రం ఎరువుల ధరలు పెంచితే మరో 1000 పెంచి ఎకరాకు రూ. 5 వేల పెట్టుబడి సాయం చేస్తున్నరు. నీటి సౌలతు, పంటలకు 24 గంటలు కరెంట్ సౌకర్యం కల్పించారు. టీఆర్ఎస్ సర్కారు రైతులకు సాయం చేస్తుంటే కేంద్రం రైతులను ఆగం చేస్తుంది. ఇప్పటికైనా ఎలాంటి కండిషన్లు పెట్టకుండా ధాన్యం కొనాలి. – ఎంబటి మల్లయ్య, కొత్త మామిడిపల్లి, దండేపల్లి
ఖబడ్దార్ మోడీ..
మంచిర్యాల అర్బన్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం రైతులను రోడ్డున పడేయాలని చూస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకు నేందుకు రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం కూలకతప్పదు. బీజేపీ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పకతప్పదు. వడ్లు కొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరుతుంటే.. కేంద్రం కొనమని చెప్పడం విడ్డూరంగా ఉంది. బీజేపీ ఎంపీలు ఈ విషయంపై స్పందించకపోవడం దారుణం. పండించిన ప్రతి గింజానూ కొనకపోతే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఖబడ్దార్ మోడీ.. ఖబడ్దార్..
పంజాబ్‌లో ఒకలా.. తెలంగాణలో మరొకలా..
తెలంగాణలో వడ్లు కొనబోమని చెప్పిన కేంద్రం, పంజాబ్‌లో మాత్రం రాజకీయ లబ్ధి కోసం ధాన్యం కొనుగోలు చేస్తున్నది. అక్కడ ఎన్నికలున్నయని కొనుగోళ్లు చేపడుతున్నరు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల హక్కులను కాలరాస్తున్నది. ఎఫ్‌సీఐ ద్వారా వడ్లను కొనుగోలు చేయాల్సిన సర్కారు కేంద్రం, తన బాధ్యతను విస్మరించింది. రాష్ట్ర ప్రభుత్వం సోయాబీన్, జొన్న, శనగలను కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నది. కేంద్రం కోనబోమని చెబుతున్నా, ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం రాజకీయాలు చేయడానికే పరిమితమయ్యారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి, రాష్ట్రంపైనే అసత్య ప్రచారం చేస్తున్నరు.
బీజేపీవి స్వార్థపూరిత రాజకీయాలు
బీజేపీ నాయకులు స్వార్థపూరిత రాజకీయాల కోసం రైతులను ఇబ్బం దులకు గురి చేస్తున్నరు. వరి కొనబోమని కేంద్రం ప్రకటిస్తుంటే, ఇక్కడి నాయకులు వరి సాగు చేయాలని రైతులను మభ్య పెడుతున్నరు. ఇదేనా రాజకీయం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే చూడలేకపో తున్నరు. కుటిల బుద్ధితో కుతంత్రాలకు తెరలేపిన్రు. పంజాబ్‌ను ఒకలా.. తెలంగాణను మరొకలా చూస్తే ఊరుకోబోం.. కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తం..