
బీజేపీ దిగి రాకుంటే ఢిల్లీలోధర్నాచేస్తాం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ అర్బన్, నవంబర్ 12 : యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కేంద్రం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట రైతు మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు మంత్రి హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినదించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ధాన్యం కొనాల్సిన కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఓ వైపు వడ్లు కొనమని కేంద్రం చెబుతుంటే, ఇక్కడి బీజేపీ నాయకులు వరి సాగు చేయాలని రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని, తమ స్వార్థ రాజకీయాల కోసం అన్నదాతలను మోసచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేయాలనే కుట్రలను మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను రూపొందిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నదని చెప్పారు.
రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో పంజాబ్ చూపుతున్న ప్రేమ తెలంగాణపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ చేసిన ధర్నాకు రైతుల నుంచి స్పందన కరువైందన్నారు. ఆ పార్టీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వడ్ల కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించకుంటే ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు వెంకట్ రాం రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్, నిర్మల్, సారంగపూర్ మార్కెట్ కమిటీల చైర్మన్లు నర్మదా ముత్యం రెడ్డి, వంగ రవీందర్ రెడ్డి, ఎంపీపీలు రామేశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, జడ్పీ కోప్షన్ సభ్యుడు సుభాష్ రావు, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, జడ్పీటీసీ జీవన్ రెడ్డి, నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి, ముడుసు సత్యనారాయణ, పూదరి నరహరి, మల్లి కార్జున్ రెడ్డి, గంగారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.