
బోథ్, నవంబర్ 12: పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ మండలం పిప్పల్ధరిలో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గ్రామంలో 46 దరఖాస్తులు రాగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎఫ్ఆర్సీ కమిటీలకు రైతులు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. కుల ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డులు లేకపోయినా దరఖాస్తులు స్వీకరించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఒకటి, రెండు రోజుల సమయం ఇచ్చి వాటిని ఇవ్వగానే సంబంధింత దరఖాస్తులకు జత పర్చాలన్నారు. గ్రామ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను ఎఫ్ఆర్సీ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు అందించాలని సూచించారు. పోడు భూముల ప్రక్రియకు సంబంధించిన వివరాలను పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇందుకుగాను ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, ఎఫ్‌డీవో బర్నోబా, తహసీల్దార్ ఎం శివరాజ్, ఎంపీడీవో సీహెచ్ రాధ, ఎంపీవో జీవన్‌రెడ్డి, సొనాల సెక్షన్ అధికారి విద్యానంద్‌రెడ్డి, సర్పంచ్ బీ శ్రీధర్‌రెడ్డి, జీపీ కార్యదర్శి రజిత, ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, నవంబర్ 12 : పోడు భూములు సాగు చేస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. దుబార్ పేట్లో గిరిజనులు సాగు చేస్తున్న పోడు వ్యవసాయ భూముల రికార్డులను శుక్రవారం ఆమె పరిశీలించారు. 2005 డిసెంబర్ 13కు ముందు సాగులో ఉన్న వారు హక్కు పత్రాలు పొందడానికి అర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు. దుబార్‌పేట్‌లో ఎంత మంది రైతులు పోడు వ్యవసాయ చేస్తున్నారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అతిఖోద్ధీన్, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో రమేశ్, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్, అటవీశాఖ బీట్ అధికారి శంకరయ్య, కార్యదర్శి పరమేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పిల్లలు ఆటపాటల్లోనూ రాణించాలి
ఆదిలాబాద్ టౌన్, నవంబర్12: పిల్లలు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకాంక్షించారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు తలిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బాల్యవివాహాలపై పిల్లలు ప్రదర్శించిన నాటిక అలరించింది. మెజీషియన్ తిరునగరి సుధాకర్ స్వామి మ్యాజిక్ ఆకట్టుకున్నది. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, డీఈవో ప్రణీత, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, షమీద్ఖాన్, ఉపాధ్యాయులు ఉన్నారు.