
మంచిర్యాల అర్బన్, నవంబర్ 12 : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా సాగాలని జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్ర వారం గద్దెరాగడి ప్రాంతంలో గల చావర్ పాస్టర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాలలో ఏసీపీ అఖిల్ మహాజన్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యను చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో అభ్యసించి మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. బాలల సంరక్షణ, వారి హక్కులను కాపాడేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ బాలలు అన్ని రంగాల్లో ముందుండాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని మాస ఉమాదేవి, డీఈవో ఎస్ వెంకటేశ్వర్లు, చైల్డ్ లైన్ డైరెక్టర్ ఫాదర్ జిజో, జిల్లా కో ఆర్డినేటర్ సత్యనారాయణ, డీసీపీవో ఆనంద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వాహిద్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.