
అఖిల భారత వనవాసీ కల్యాణ ఆశ్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్‌కే నాగు
ఇంద్రవెల్లి, నవంబర్ 12 : మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయ దర్బార్హల్లో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహించే బిర్సాముండా జయంతి ఉత్సవాలతోపాటు జనజాతి గౌరవ దినోత్సవ బహిరంగా సభకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావ్, జాతీయ షెడ్యూల్డ్ కమిషన్ సభ్యులు అనంతనాయక్ వస్తున్నట్లు అఖిల భారత వనవాసీ కల్యాణ ఆశ్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్‌కే నాగు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నాగోబా విద్యార్థి నిలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనవాసీ కల్యాణ పరిషత్‌తో పాటు వనవాసీ కల్యాణ ఆశ్రమం ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి కృషిచేస్తున్నదన్నారు. విద్యతో పాటు వైద్యం పరంగా మరింత చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నిజాం కాలంలో బిర్సాముండా ఒరిస్సా, జార్ఖాండ్ రాష్ర్టాల్లో ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలతో పాటు వారి హక్కుల కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఆయన జయంతిని జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రతిపాదించిందన్నారు. భూపాల్‌లో నిర్వహించే జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో వనవాసీ కల్యాణ పరిషత్ రాష్ట్ర సంఘటన మంత్రి పట్లొల్ల సువీర్, వనవాసీ కల్యాణ పరిషత్ విద్యా విభాగ ప్రముఖ్ డివిరావ్ ఉన్నారు.