
డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలు
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష
హాజీపూర్, నవంబర్ 12 : స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకరించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16న స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నదని తెలిపారు. డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 23న నామినేషన్ల స్వీకరణ ముగుస్తుందని, 24న పరిశీలించనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉప సంహరణకు 26వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. జిల్లాలో వార్డు కౌన్సిలర్లు-149, జడ్పీటీసీలు – 16, ఎంపీటీసీలు – 128, ఎమ్మెల్యేలు – 3 మొత్తంగా 296 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.